హైదరాబాద్ – తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాల్సిన అవసరం వచ్చిందన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని..కాని ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా తమ కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చిందన్నారు . తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని జోస్యం చెప్పారు. గడిచిన 9ఏళ్లలో బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కుటుంబ పాలనలో ప్రజలు మోసపోయారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేవలం కేసీఆర్ తన కొడుకు, కూతురికి పదవులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు రాజకీయ ఉపాధి కల్పించారని మండిపడ్డారు. నిరుద్యోగులు, యువతను మోసం చేశారని ఆరోపించారు
.
గడిచిన 9ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. అందుకే ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ..కాబట్టి రాబోయేది కమల వికాసమే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదని..రెండు ఒకే పార్టీలన్నారు. వాటి డీఎన్‌ఏ ఒకటేనన్నారు. ఈ రెండు పార్టీల్లో అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు కామన్‌గా ఉంటాయన్నారు. దేశ వ్యాప్తంగా ఓబీసీ, బీసీలకు రాజకీయంగా ఉన్నతమైన పదవులు కల్పించింది బీజేపీయేనని గుర్తు చేశారు మోడి
బీఆర్ఎస్ పార్టీకి 2019లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా అవినీతి సొమ్ము వెనకేసుకొని అహంకారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూడా బీఆర్ఎస్ నేతలు ఉన్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రాగానే అవినీతిని అంతం చేస్తామన్నారు. బీసీ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదన్నారు. బీసీలకు రూ.1 లక్ష ఇస్తామని మోసం చేసిందన్నారు. తాము మాత్రం మెడికల్, డెంటల్ సీట్లలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. టీచర్ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఇచ్చే రేషన్‌ను మరో అయిదేళ్లు పొడిగించినట్లు చెప్పారు