హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న కుతూహలంతో బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం పరుగులు పెడుతోంది. మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశలో వ్యూహాలను సిద్దం చేస్తున్న నాయకత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుని వాటి అమలు బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలలో కనీసం 70 స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. నియోజకవర్గాలలో బలమైన నేతలను గుర్తించడం, ప్రజా సమస్యలపై పోరాటాలకు శ్రేణులను సన్నద్దం చేయడం, ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేయడంపై ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాలలోని శ్రేణులను అప్రమత్తం చేసేందుకు సీనియర్ నేతలపై బాధ్యతలను ఉంచారు.
కాగా, రాష్ట్రంలో 31 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసినవి ఉన్నాయి. ఇందులో 19ఎస్సీ నియోజకవర్గాలు కాగా 12ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలలో బీజేపీ మొదటి నుంచి అంతంత మాత్రంగానే ఉంది. తొలుత ఈ నియోజకవర్గాలలో పట్టు సాధించాలని నిర్ణయించిన నాయకత్వం మిషన్ 19, మిషన్ 12 పేరిట కమిటీలను వేసింది. మిషన్ 19కి మాజీ ఎంపీ ఏపీ జితేందర్, మిషన్ 12కు మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావులకు బాధ్యతలను అప్పగించారు. ఈ రెండు కమిటీలు ఏం చేయాలి, ఆయా నియోజకవర్గాలలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలన్న అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలువురు నేతలు మేధో మధనం చేసి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు.
ఈ మార్గదర్శకాల అమలుపై జనవరి మాసంలో రెండు రోజుల పాటు వర్క్‌షాప్‌ను కూడా నిర్వహించారు. బలమైన అభ్యర్థులను గుర్తించడం, పార్టీకి పట్టులేని ప్రాంతాలలో చేపట్టాల్సిన చర్యలు, ఇతర పార్టీలకు చెందిన వారిని ఆకర్షించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలను గుర్తించి పోరాటాలకు శ్రీకారం చుట్టడం ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరిలో జరిగిన భేటీ తర్వాత ఇప్పటి వరకు ఆ కమిటీలకు బాధ్యులైన వారు ఆ నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రస్తుతం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీకి అన్నివర్గాల వారిని మెప్పించి, ఒప్పించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో బాధ్యతలు ఉన్న నేతలు తమ విధులను విస్మరించడంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.