బీజేపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ ‘మన మోడీ గ్యారంటీ 2024’ పేరుతో విడుదల చేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలుచేసేస్తారని చెప్పారు. 2047 వికసిత భారత్ పేరుతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు. అవినీతి, బంధుప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్టలేదని విమర్శించారు. కాగా మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో బీజేపీ రూపొందించిన జాతీయ మేనిఫెస్టోను వారం ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు కలిసి విడుదల చేయగా తాజాగా ఇవాళ తెలంగాణలో తెలుగు మేనిఫెస్టోను రాష్ట్ర నేతలు విడుదల చేశారు. కాగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 14 అంశాలను చేర్చారు. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం, మరో ఐదేళ్లు ఉచిత రేషన్, పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్, ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షల వరకు పెంపు, ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు వంటి ముఖ్యమైన హామీలు ఉన్నాయి.
సమాజంలోని అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు… పంటల బీమా మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భారతదేశాన్ని మిల్లెట్ హబ్ గా మర్చుతామని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు గ్యారంటీతో పాటు మరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చామని, పోస్టాఫీసులను మినీ బ్యాంక్ లుగా మార్చేస్తున్నామని, భారత్ ను సర్వీస్ సెక్టార్ హబ్ గా విస్తరిస్తామని అన్నారు. మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అన్నారు.