హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ ఇంద్రధనస్సు పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయబోతోంది. మేనిఫెస్టోకు ”ఇంద్రధనస్సు” అని పేరు పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇంద్రధనస్సు లోని ఏడు ప్రత్యేక రంగులకు ప్రతీకగా ఏడు ప్రత్యేక మైన హామీలు ఇవ్వనుంది. ఆ హామీలకు నరేంద్ర మోడీ గ్యారంటీ స్కీమ్లుగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇవ్వనున్న ఏడు హామీల్లో ఉచిత విద్య, వైద్యంతోపాటు యువతకు పలు స్వయం ఉపాధి పథకాలు, సబ్సిడీ రుణాలు, నిరుద్యోగులకు ప్రతి ఏడాది ఖాళీల భర్తీకి జాబ్ క్యాలండర్, యూపీ పీఎస్సీ తరహాలో ఉద్యోగ నోటిఫికేషన్లు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే వెయ్యి అదనంగా పింఛన్, రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం, మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనె క్షన్లు, పేదలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు… ఇలా మేనిఫెస్టోలో కీలక హామీలు చేర్చినట్లు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ అమలు చేస్తామన్న హామీని మేని ఫెస్టోలో బీజేపీ ప్రకటించనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ పకడ్బందీగా మేని ఫెస్టో రూపొందించి విడుదల చేసింది. ఆ ఎన్నికల్లో మేనిఫెస్టో విజయవంతం కావడంతో బీజేపీ ఏకంగా 48 కార్పో రేటర్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేనిఫెస్టోను రూపొందించిన అనుభవం ఉన్న జి.వివేక్ని ఈసారి కూడా మేనిఫెస్టో కమిటీ- చైర్మన్‌గా పార్టీ నియమించింది. మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా మేనిఫెస్టో కమిటీ-లో ఉన్నారు. రైతులు, యువత, మహిళలను ఆకట్టు-కునే పథకాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అధికార బీఆర్ఎస్, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే పలుమార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రకటించారు. ఆచరణ సాధ్యమైన హామీలనే మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. యువతకు ఉద్యోగాలు, పేదలకు డబుల్ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని బ్యాంకు రుణాలు తదితర కీలక హామీలు మేనిఫెస్టోలో ఉండబోతున్నట్లు వాళ్లు హింట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్పై, ప్రత్యర్థి కాంగ్రెస్‌పై ఏయే వర్గాలు అసంతృప్తితో ఉన్నాయో మేనిఫెస్టోలో పలు హామీలు ఇవ్వడం ద్వారా ఆ వర్గాలను బీజేపీకి దగ్గర చేసుకునేలా మేనిఫెస్టో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బీసీల సంక్షేమానికి కూడా మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమానికి ఏం చేస్తామో వివరిస్తూ మేనిఫెస్టో ఉండనుంది. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిగా మేనిఫెస్టో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ విడుదల చేయబోయే ఎన్నికల మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
15 లేదా 16న బీజేపీ మొదటి విడత జాబితా…
ఈ నెల 15 లేదా 16 తేదీల్లో దాదాపు 40 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ మొదటి విడత జాబితా విడుదల చేసేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. దాదాపు 30 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఒకే నేత పోటీలో ఉన్న, ప్రజల్లో బలమైన పలుకుబడి ఉన్న నేతలతో విజయావకాశాలు మెండుగా ఉన్న స్థానాలకు మొదటి విడత జాబితాలో అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. వాస్తవానికి ఇప్పటికే మొదటి విడత జాబితా సిద్ధమైన అధిష్టానం ఆమోదం కోసం రాష్ట్ర నాయకత్వం పంపింది. ఈ నెల 14తో అమావాస్య ముగిసి మంచి రోజులు రానున్న నేపథ్యంలో తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది.