తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని ములుగు జిల్లా బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రజలంతా కేసీఆర్ విధానాలను ప్రశ్నించాలని వెంకటాపూర్ బిజెపి మండల అధ్యక్షుడు భూక్యా జవహర్ లాల్ కోరారు. సోమవారం పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ మంజులకు వినతి పత్రం అందించారు. అనంతరం జవహర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని రాష్ట్రాలు తగ్గించాయని గుర్తు చేశారు. అయితే, బంగారు తెలంగాణ అని మాయ మాటలు చెప్పిన కేసీఆర్ మాత్రం వ్యాట్ ను తగ్గించకుండా నియంతృత్వ పరిపాలన చేస్తూ ప్రజల నడ్డి విరుస్తూ ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా వెంటనే వ్యాట్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట బిజెపి నాయకులు కారుపోతుల యాదగిరి గౌడ్, అల్లె శోభన్, మేకల రమేష్, ప్రభాకర్ రెడ్డి, వినోద్, తదితరులు ఉన్నారు.