Sunday, November 24, 2024

హైదరాబాద్ లో గంజాయి దందా.. సర్కార్ ఏం చేస్తోంది?

హైదరాబాద్‌ నగరం గంజాయి దందాకు అడ్డగా మారిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు.” హైదరాబాద్ నగరంలో గంజాయి దందా మూడు కిక్కులు, ఆరు దమ్ములు అన్న చందంగా మారింది. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో గంజాయి దందా ఎలా జరిగిందో… రాష్ట్రంలో ఇపుడు అదే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఇటీవల సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఒక చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ రాజు గురించి విచారించిన పోలీసులు.. అతనికి ఉన్న వ్యసనం గంజాయి అనీ… ఆ మత్తులోనే కిరాతక ఘాతుకానికి పాల్పడ్డాడని… పోలీసుల విచారణలో తేలిందంటే ప్రభుత్వం ఎంత నిద్ర మత్తులో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, గంజాయి కేవలం సింగరేణి కాలనీకే పరిమితమయ్యిందా?… అంటే నమ్మడం అసాధ్యం. పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్న పిల్లలు మొదలు, పెద్దవారు, బడాబాబులు సైతం గంజాయికి బానిసలయ్యి మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు అందుకు నిదర్శనం. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో సెలబ్రిటీలు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల మధ్యలోని బస్తీల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నా… పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బస్తీల్లోకి వెళ్లేందుకు కూడా పోలీసులు సాహసం చేయడం లేదంటే… ఎంత నెట్‌వర్క్‌తో గంజాయి దందా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నగరంలోని వివిధ పార్కుల్లో యువత సిగరెట్‌లోని పొగాకు తీసి, గంజాయి కుక్కి సేవిస్తూ మత్తులో ఊగుతున్నారంటే… తెలంగాణ యువత ఎంతటి దౌర్బాగ్య స్థితికి దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా…. చీకటి ముసుగులో నగర గల్లీగల్లీలో యువత గంజాయికి ఎంతగా ప్రభావితులు అవుతున్నారో ఆ దేవుడికే తెలియాలి. యువత ఇంతలా చెడిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఉండడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి గంజాయి మత్తు నుంచి యువతరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే మంచిది.’’ అని విజయశాంతి అన్నారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ బైపోల్: స్వరం పెంచిన ఈటల..

Advertisement

తాజా వార్తలు

Advertisement