Saturday, November 23, 2024

ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు లేవు

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పే రాష్ట్ర సర్కార్…. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకని సకాలంలో జీతాలు అందించడం లేదో తెలపాలి. నెలంతా కష్టపడి ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకైనా జీతాలు అందితే గాని కుటుంబాలు జీవనం సాగని దుస్థితి వారిది. పథకాల అమలుకు, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహణ చేసే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సెర్చ్ ఉద్యోగులపై టీఆర్ఎస్ సర్కార్ చిన్న చూపు చూస్తూ సకాలానికి జీతాలు ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తోంది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా భావించే బతుకమ్మ సంబురం మొదలుకావడంతో ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తుంది. పండగ పూట చేతిలో డబ్బు లేక ఆందోళన పడాల్సిన దుస్థితి దాపురించింది. 

మరోవైపు నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రతి నెల 14నుంచి 20 వరకు వేతనాలు జమకాని పరిస్థితులు ఏర్పడ్డాయంటే రాష్ట్ర సర్కార్ ఉద్యోగులపై ఎంత చిత్త శుద్ధి కనబరుస్తుందో అర్ధమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైందంటూనే జీతాలను ఆలస్యం చేస్తూ దాదాపు ఆరునెలల నుంచి వేతనాలను జిల్లాల వారీగా ఇస్తోంది. ఇప్పుడు పండుగల సమయంలో కూడా పాత పద్ధతినే అమలు చేస్తామని ఉన్నతాధికారుల ద్వారా వెల్లడించడం సిగ్గుచేటు. ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డు దాటాక బోడ మల్లన్న అన్నట్టు ఉంది రాష్ట్ర సర్కార్ తీరు. పట్టభద్రుల ఎన్నికలప్పుడు పీఆర్సీ పెంచుతాం, జీతాలు పెచుతాం అని ఓట్లు పొందడమే కానీ ఇప్పటి వరకూ పెంచిన జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు మినహా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌తో  పాటు హోంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు పెరిగిన వేతనాలు అందించకుండా పాత వేతనాలనే విడుదల చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వకుండా వేతనాల పెంపుపై జీవోలు జారీ చేయకుండా ఉద్యోగులను అన్యాయం చేస్తుంది. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికపై ఓటమి భయంతో ఉన్న రాష్ట్ర సర్కార్. అక్కడి ఓటర్లకు గాలం వేయడానికి డబ్బును, మద్యాన్ని, దావత్‌లను ఇస్తూ డబ్బు ఖర్చు చేస్తుందే కానీ ఉద్యోగుల జీతభత్యాలపై ఏ చీకు చింతా లేని రాచరిక దుర్మార్గపు పాలనపై.. యావత్ తెలంగాణ ప్రభుత్వ, కాంట్రక్టు,ఇతర ఉద్యోగులు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారు’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆల్ టైమ్ హైకి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement