బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్చార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను పార్టీ నియమించింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఇన్చార్జిటలను నియమిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు ప్రకాశ్ జవదేకర్‌ని ఇన్చార్జిగా, సునీల్ బన్సల్ ను సహాయ ఇన్చార్జిగా హైకమాండ్ నియమించింది.
మరో ఐదారు నెలల్లో తెలంగాణలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని తప్పించి, ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించింది. ఇతర రాష్ట్రాల విషయంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్చార్జిగా ఓపీ మాథుర్, సహాయ ఇన్చార్జిగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాజస్థాన్ ఇన్చార్జిగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ ఇన్చార్జిగా గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా భూపేంద్ర యాదవ్, సహాయ ఇన్చార్జిగా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను పార్టీ హైకమాండ్ నియమించింది.