బీఆర్ఎస్ విముక్తి తథ్యం .. కాంగ్రెస్ స్థితి అంతే
బీజేపీ హవా నడుస్తోంది
దళితులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ద్రోహం
హామీ తప్పి సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారు
నీటి పారుదల ప్రాజెక్టులన్నీ బీఆర్ఎస్కి ఏటీఎంలే
కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకే ఈ డబ్బులన్నీ పోతున్నాయ్
ఇచ్చిన మాట తప్పం.. బీజేపీతోనే సకల జనుల సౌభాగ్యం
కామారెడ్డిలో పీఎం నరేంద్ర మోడీ
కామారెడ్డి – బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో అల్లాడిపోయిన తెలంగాణ ప్రజలు.. బీఆర్ఎస్ నుంచి విముక్తిని కోరుతున్నాయని, అదే విధంగా ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పాలన తీరు నుంచి విముక్తి కోరుతున్నారని, గడచిన తొమ్మిదేళ్లల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసిందని, అందుకే ప్రజలు ప్రతిఘటిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డిలో బీజేపీ విజయ సంకల్పయాత్ర సభలో ఆయన తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నా కుటుంబ సభ్యులారా? అని ఆయన సంబోధించగానే సభికుల్లో కేరింతలు మార్మోగాయి. రామమందిరం నిర్మాణం పూర్తి కావచ్చిందనగానే సభికులు ఆనందోత్పాహాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆశలు అలలుగా, తరంగాలుగా ఉప్పెనలా పొంగుతున్నాయని, కేసీఆర్ చేసిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రజలు సర్వసన్నద్ధమయ్యారని, బీఆర్ఎస్ నుంచి విముక్తి కోసం పెద్ద ఆశలు పెట్టుకున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణాలో బీజేపీ గాలి వీస్తోందని, రైతులు, మహిళలు, యువకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల ఆశలను నెరవేర్చేందుకు సకల జనుల వికాస తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు.
బీఆర్ఎస్ అధినేత ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఒక్కటీ నెరవేర్చలేదని, కానీ బీజేపీ ఏమి చెప్తుందో.. అదే చేస్తుంది, 370 ఆర్టికల్ , మహిళలకు 33 శాతం రిజ్వరేషన్, సైనికులకు ఒన్ మేన్ ఒన్ పెన్షన్, రైతులకు ఒకటిన్నర రెట్ల కనీస మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చాం, నెరవేర్చాం, అలాగే తెలంగాణ ప్రజలకు ఆదివాసీ కేంద్ర విశ్వవిద్యాలయం, పసును బోర్డు ఏర్పాటు హామీ ఇచ్చాం ..నెరవేర్చాం అని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. ఒక కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని, ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే దళితులను సీఎంగా చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల తరువాత సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
బీజేపీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తోందని, కేంద్ర మంత్రులుగా, కడకు ప్రధానిగా బీసీనే ఎంచుకుందని, తెలంగాణ సీఎం పదవిని బీసీలకే ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇక తెలంగాణాలో మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని, ఈ అన్యాయాన్ని అడ్డుకుంటామని, ఇప్పటికే మాదిగల సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేశామని, సుప్రీం కోర్టులోనూ తగిన చర్యలు తీసుకొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఇక రైతులకు కేసీఆర్ దగా చేస్తున్నారని, తనకు డబ్బులు అవసరమైనప్పుబు సాగునీటి ప్రాజెక్టులను తెరమీదకు తీసుకు వచ్చి లక్షల కోట్లు దోచుకొంటున్నారని నరేంద్ర మోదీ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల్ని ఏటీఎంలుగా వాడుకుని తమ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వేస్తున్నారని నరేంద్ర మోదీ ఆరోపించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు వెనకాడటం లేదని, రైతులకు ప్రధాని యోజనాలో తెలంగాణా రాష్ట్రంలోని 40 లక్షల మందికి డబ్బులు వేస్తున్నామని, కామారెడ్డిలో లక్షన్నరమంది రైతులకు రూ.400 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను సాగనంపటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.