రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో బీజేపీ గావ్ చలో(పల్లెకు పోదాం) అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముందుగా సరదాగా స్థానిక ప్రజలతో కలిసి నడుస్తూ, మహిళలు, గ్రామస్తులు, అరుగు బయట కూర్చున్న వారితో మాట్లాడారు. బియ్యం వస్తున్నాయా..? బియ్యం ఎవరిస్తున్నారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోడీ ఇస్తున్నారని మహిళలు తెలిపారు. ఒక్కొకరికి ఎన్ని కిలోలు వస్తున్నాయని ప్రశ్నించారు ఆరు కిలోలు వస్తున్నాయని సంతోషంగా తెలిపారు. మోడీ పంట పెట్టుబడి పైసలు వస్తున్నాయా అని ఆరా తీసారు. వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. మోడీ పైసలు రాకపోతే స్థానిక బీజేపీ నాయకులను కలిసి తహసీల్దార్ దగ్గరికి వెళ్తే మోదీ పైసలు వస్తాయని సూచించారు.
అనంతరం బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 24గంటల పాటు గ్రామాల్లో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని తెలిపారు. రైతులు, మహిళలు, రైతు కూలీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశం అవుతున్నామన్నారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కార్యక్రమం లక్ష్యమన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పల్లెకు పోదాం.. అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి, మహిళా సాధికారత, శాంతి భద్రతల కోసం దేశంలోని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జాతీయ రహదారులతో దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం అనుసంధానం చేసిందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో నిత్యావసర ధరలను తగ్గించగలిగామన్నారు. నిత్యావసర ధరలపైన ప్రతిపక్షాలు ప్రశ్నించింది లేదని తెలిపారు.
తెలంగాణ పేరు తొలగించిన రోజే కేసీఆర్ పార్టీ ఖతమైందన్నారు. భాజపాకు కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. పోలింగ్ బూత్ లో వంద ఓట్లు పోలైతే. . 51 ఓట్లు భాజపాకు రావాలన్నారు. 70 శాతం ఓట్లు తెచ్చిన బూత్ నాయకులను సన్మానిస్తా అన్నారు. ముస్లిం మహిళల ఓట్లను కూడగట్టుకొని మెజార్టీ తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలను వంట ఇంటి కుందెల్లుగా, పిల్లలను కనే యంత్రాలుగా తయారు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జీ అందెల శ్రీరాములు యాదవ్ , అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చ సభ్యులు పాపయ్య గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్ అనంతయ్య గౌడ్, సీనియర్ నాయకులు జంగయ్య యాదవ్, మహేశ్వరం మండల అధ్యక్షుడు మాధవ చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి యాదయ్య,జిల్లా మహిళా మోర్చ అనిత, అమీర్ పేట గ్రామ సర్పంచి శ్రీశైలం గౌడ్, జిల్లా నాయకులు, మండల నాయకులు, శక్తి కేంద్రం ఇన్చార్జ్లు, బూత్ అధ్యక్షులు మరియు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.