హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈడీ విచారణ పేరుతో సోనియా, రాహుల్ గాందీలను కించపర్చాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. శనివారం గాంధీభవన్‌లో టీ పీసీసీ ముఖ్య నేతలు, పీఏసీ, కార్యవర్గ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్ జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, పీఏసీ చైర్మన్ షబ్బీర్‌అలీ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు సోమవారం పాదయాత్రగా ర్యాలీతో వెళ్తారని, అదే రోజు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాల ముందు నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు.
అందులో భాగంగానే హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్డులోని ఇందీరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో నల్ల దుస్తులు, నల్ల కండువాలు కప్పుకుని నిరసన తెలుపుతామన్నారు. ‘ నేషన్ హెరాల్డ్‌లో ఆర్థిక అవకతవకలు. అక్రమాలు జరగలేదని కేంద్ర ప్రభుత్వమే 2015 లో చెప్పింది. యంగ్ ఇండియా ట్రస్ట్ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుస్తోంది. పదవీ త్యాగాలకు మారుపేరు సోనియా, రాహుల్ గాంధీలు. ఈడీ విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ శ్రేణులంతా శాంతియుతంగా నిరసన చేపడుతాం. రాహుల్‌గాందీ ఈడీ ఆఫీసులోకి వెళ్లి బయటకు వచ్చేంత వరకు ఈడీ కార్యాలయం వద్దే ఉంటాం ‘ అని రేవంత్‌రెడ్డి వివరించారు. బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.
రైతు రచ్చబండ 15 రోజులు పొడిగింపు..
రైతు రచ్చబండ కార్యక్రమాలు ఈ నెల 21 వరకు చేయాల్సి ఉండగా.. మరో 15 రోజులు పొడిగించి జూలై 21 వరకు నిర్వహించాలని అని రేవంత్‌రెడ్డి సూచించారు. నాయకులు పని చేయకపోతే టికెట్లు రావని, గాంధీభవన్ చుట్టు తిరిగితే పదవులు రావని ఆయన సూచించారు. గ్రామాల్లో తిరిగి ప్రతి గడపను తట్టాలన్నారు. పెద్ద నాయకులు బాగా పని చేస్తుంటే భవిష్యత్‌లో ఎదిగే నాయకులు ప్రజల్లో తిరగడం లేదన్నారు. పార్టీ కార్యక్రమాలు, నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఏఐసీసీకి నివేదికలు వెళ్లుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని బీజేపీ చూస్తోందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మైనార్టీ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచారల ఘటనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.