మహబూబ్ నగర్, నవంబర్ 26 (ప్రభ న్యూస్): మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విజయసంకల్ప సభలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమస్కారం తెలంగాణ అంటూ యోగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారు. తెలంగాణ కోసం వేలాదిమంది యువకులు ప్రాణాత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ఆరోపించారు.
తెలంగాణలో మాఫీయా రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఈ మాఫీయాను హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. 2017 కంటే ముందు ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి మాఫీయా ఉండేదని, ప్రతి రెండు, మూడు రోజులకోసారి గొడవలు జరిగేవన్నారు. మోదీ నేతృత్వంలో, మార్గదర్శకంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ హయాంలో ఎలాంటి కర్ప్యూ లేదన్నారు . కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. ఈ మూడు పార్టీలకు ఓట్లు వేస్తే వీరు బలోపేతం అవుతారని అన్నారు. మోదీ నేతత్వంలో దేశం గౌరవ ప్రతిష్టలు పెరిగాయని,మోదీ హయాంలో దేశంలో మౌళిక వసతుల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు.
వందేభారత్ రైలు, హైవే, ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో 6 ఏళ్లలో 55 లక్షల మంది ప్రధానమంత్రి అవాజ్ ఇళ్లు నిర్మాణం చేసినట్లు తెలిపారు. తెలంగాణాలో పేపర్ లీకేజీ జరుగుతున్నదని, ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైందని,దేశంలో సబ్కా సాత్ సబ్ కా. వికాస్ నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. జనవరి 22న అయోధ్య రాంమందిర్ లో మోదీ చేతులమీదుగా ప్రతిష్టాపన జరుగుతున్నట్లు యోగి వెల్లడించారు.మీరందరూ కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న అని యోగి ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మాచారి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.