Tuesday, November 26, 2024

BJP BC Mantra – బిసి డిక్ల‌రేష‌న్ కు బిజెపి రెడీ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ తన ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు ఉన్న సామాజిక కులాలపై పలు సంస్థలు, నేతల ద్వారా సర్వే నిర్వహించినట్లు తెలిసింది. జనాభా పరంగా, ఓట్ల పరంగా బీసీలే అత్యధికంగా ఉండడంతో వారికిచేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లుతెలుస్తోంది.

త్వరలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించేందుకు తెలంగాణ బీజేపీ సిద్దమైనట్లు ఆసామాజికవర్గానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు. గడిచిన 9ఏళ్లలో 18లక్షల కోట్ల బీసీ సబ్ప్లాన్‌నిధులను సీఎం కేసీఆర్‌ పక్కదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బీసీ సామాజికవర్గంలోకి తీసుకె ళ్లాలని అందుకు ప్రత్యేకంగా బీసీ గోస అనే కార్యక్రమాన్ని రూపొందించింది. నియోజకవర్గాల వారీగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి బీసీలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని నేతలు చెబుతున్నారు. అదే సమయంలో బీసీ సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్‌ను తప్పించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించిన పార్టీ హైకమాండ్‌ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తే బీసీ సామాజికివర్గానికి చెందిన బండి సంజయ్‌ను లేదంటే ఎంపీ లక్ష్మణ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో బీజేపీకి ఓటు వేస్తే పక్కాగా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతనే సీఎం అవుతారని కూడా ప్రకటించే యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే సీఎం అవుతాడని, ఇక కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ఒక అగ్రవర్ణానికి చెందిన నేత మాత్రమ సీఎం అవుతారని, ఇప్పటి వరకు అదే జరిగిందని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ గుర్తు చేస్తున్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతనే 100శాతం సీఎం అవుతారని చెప్పనున్నట్లు తెలిపారు. బీసీ సామాజికవర్గంలో లమైన ముదిరాజ్‌, మున్నూరు కాపులు, యాదవ నేతలు పలువురు తమతో టచ్‌లో ఉన్నారని, బీసీ అభ్యర్థే సీఎం అని ప్రకటిస్తే ఎన్నికల్లో గణనీయంగా లబ్ది పొందే అవకాశం ఉటుందని బీజేపీ భావిస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన పలానా నేత సీఎం అవుతారని ప్రకటించడ ం కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతనే సీఎం అవుతారని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీసీ నేతే సీఎం అవుతారని ప్రకటించడం ద్వారా ఇన్ని రోజులు టీడీపీకి అండగా ఉన్న బీసీ సామాజికవర్గ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఓ ముఖ్యనేత చెప్పారు. ఇన్నిరోజులు టీడీపీలో యాక్టివ్‌గా ఉండి ఇప్పుడు బీఆర్‌స్‌లో చేరిన బీసీ నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేలా బీసీ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బీసీ ఓట్లు గంప గుత్తగా బీజేపీకి పడేవిధంగా వ్యూహాన్ని అమలు చేయడంలో ఆ పార్టీ అధిష్టానంతోపాటు రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement