Tuesday, November 26, 2024

BJP – కుమ్ములాట‌ల‌తో న‌ష్ట‌పోయాం…లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో అలా కాకూడ‌దు – అమిత్ షా

హైదరాబాద్‌: వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ భాజపా ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వార్నింగ్‌ ఇచ్చారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన అమిత్‌ షా హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్బంగా లోక్ సభ అభ్యర్థుల విషయంలో అమిత్ షా రాష్ట్ర నేతలకు కీలక సూచన చేశారు. నలుగురు సిట్టింగ్‌లు తిరిగి అదే స్థానాల నుంచి పోటీ చేయబోతున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు. . ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్, సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ న‌లుగురికి మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయన్నారు. ”30 సీట్లు వస్తాయని ఆశించాం.. కానీ, అనుకున్నన్ని సీట్లు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి. సిట్టింగ్‌ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తాం” అని అమిత్‌ షా తెలిపారు. అంతకుముందు శంషాబాద్‌ విమానాశ్రయంలో అమిత్ షాకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌ స్వాగతం పలికారు.

ఈ స‌మావేశం త‌ర్వాత అమిత్ పాత‌బ‌స్తీలోని భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.. ఆయ‌న అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.. అనంత‌రం అల‌య క‌మిటీ అమ్మ‌వారికి తీర్ధ ప్ర‌సాదాల‌ను, జ్ఞాపిక‌ను అమిత్ కు అంద‌జేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement