హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన 67వ పుట్టిన రోజును నేడు జరుపుకుంటున్నారు… ఈ సందర్భంగా ఆయనకు దేశ, విదేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి… భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి తన ట్విట్టర్ ద్వారా కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్ కుమార్ తదితరులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌లు చేశారు. ఆయన నిండ నూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు తమ ట్వీట్‌లలో ఆకాంక్షించారు. ఇక రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీరు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే ఎపి ముఖ్యమంత్రి జగన్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా వైసిపి, టిడిపి, బిజెపి, జనసేనకు చెందిన ఎపి నేతలు కూడా కెసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తమ తమ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక కెసిఆర్ క్యాబినేట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సైతం తమ అధినేత పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు..
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నా జన్మదాతకు, నిత్య స్ఫూర్తిప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు అని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు.
మంత్రి హరీశ్ రావు కెసిఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, కారణ జన్ములైన కేసీఆర్ వల్లే దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని చెప్పారు. కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజని చెప్పారు. ‘మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.