హనమకొండ : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 6 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. గురువారం సుబేదారి పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబేదారి ఇన్ స్పెక్టర్ పి.సత్యనారాయణరెడ్డితో కలిసి ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడారు.
గురువారం అదాలత్ సెంటర్ వద్ద సుబేదారి సబ్ ఇన్ స్పెక్టర్ గాలిబ్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని పట్టుకుని విచారించగా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముస్కుల అఖిల్, ముస్కుల అభిరామ్, ముస్కుల సిద్ధార్థ, ముస్కుల మధుసూదన్ అనే యువకులు గత రెండు, మూడు నెలలుగా సుబేదారి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాంనగర్, సాయి నగర్, బాలసముద్రం, భవాని నగర్, నయీమ్ నగర్, అమరావతి నగర్ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఇళ్లల్లో ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి వాటిని అమ్మి, వచ్చే డబ్బుతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
అరెస్టు చేసిన నలుగురు నిందితుల నుండి 4,60,000 విలువగల 6 ద్విచక్ర వాహనాలను, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. నిందితులను పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సుబేదారి సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి, ఇన్ స్పెక్టర్ గాలిబ్, ఏఎస్ఐ పాపయ్య, హెడ్ కానిస్టేబుల్ రోషన్ అలీ, కానిస్టేబుల్ అఖిల్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని ఏసీపీ దేవేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు రామారావు, ఫణి, ఘాలిబ్ లు పాల్గొన్నారు.