ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా మోరంచపల్లి గ్రామంలో గురువారం సృష్టించిన వరద భీభత్సం అంతా ఇంతా కాదు. మోరంచ వాగు మహోగ్రరూపానికి సుమారు 320కి పైగా ఇండ్లు వరద తాకిడి గురయ్యాయి. నలుగురు మృత్యువాత పడగా, ఒకరు గల్లంతయ్యారు. వందలాది పశువులు జలసమాధి కాగా ఒక్కోఇంట్లో రూ.లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. ఈ విషాద సంఘటన పై భిన్న రకాల చర్చలు వినవస్తున్నాయి. ఈ ప్రమాదం జరుగడానికి ప్రకృతి విపత్తా.. అధికారుల నిర్లక్ష్యమా..! అని సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మోరంచ వాగు పుట్టుక ఎక్కడా..?
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప నల్లకాలువ, సోమిడి కాల, ఓగరు కాల , టైగర్ తూము, టవర్ తూములు మిగులు నీటితో ,బూర్గపేట ఎగువన అడవి నుండి వచ్చే మారేడెగొండ ఒర్రెలు లక్ష్మీదేవి పేట పాలంపేట మధ్యలో కలిసి మోరంచవాగు పుట్టుక మొదలవుతుంది. వివిధ కాలువలు, చెరువుల ద్వారా వరద ‘ అంచెలంచలుగా’ పెరుగుతూపోతుండటంతో ‘మోర్ అంచ’ మోరంచగా పిలుస్తారు అనేది ప్రచారంలో ఉంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మీదుగా గణపురం, భూపాలపల్లి, చిట్యాల, మల్హల్ రావు మండలం మీదుగా దాదాపు 25 కిలోమీటర్ల పొడవుతో 25
గ్రామాలను కలుపుతూ వంకలు తిరుగుతూ ప్రవహిస్తూ మానేరువాగులో కలుస్తుంది. అయితే తూర్పు నుండి పడమర వరకు సంవత్సరం పొడవున జీవధారల ప్రవాహం ఉండటం ఈ వాగు ప్రత్యేకత.
మోరంచ వాగులో కలిసే జల ప్రవాహాలు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట నుండి బయలుదేరే మోరంచవాగుకు (బూర్గపేట చెరువు) మారేడుగొండ ఒర్రె ,లక్ష్మీదేవిపేట ఊర వాగు వద్ద కలిసి వెల్తుర్లపల్లికి వచ్చే మోరంచలో కలుస్తాయి. పెద్దపురం ఎర్రచెరువు, ఎల్లారెడ్డిపల్లి చెరువు, ధర్మరావుపేట ఊరచెరువు, నగరంపల్లి సుద్దకుంట,ఊర చెరువు, కొండాపూర్ శివారు సీతారాంపురం చిర్రకుంట చెరువు, కుంటలు, తూపురం కుంట, బస్వరాజుపల్లిలోని పలు కుంటలు, ఇటుకాలపల్లి చెరువు, చెల్పూర్ ఊర చెరువు, వివిధ కుంటలు, చెరువులు వచ్చి మోరంచలో కలుస్తాయి. కర్కపల్లి సబ్బిడికుంట, గాంధీనగర్ జమేదారికుంట, గణపసముద్రం చెరువు, దొమ్మటిపెల్లి చెరువుల నీళ్ళు కలుస్తాయి.
మోరంచవాగు పై మూడు ఎత్తిపోతల పథకాలు, పలు మాట్లు
మోరంచవాగు పై వెల్తుర్లపల్లి, చెల్పూర్, మోరంచపల్లి దగ్గర ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాల కింద నాలుగు వేల ఎకరాలు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ కింద 3వేల ఎకరాలు, కొండాపురం, లక్ష్మీదేవిపేట, గణపురం, నగరంపల్లి, చెల్పూర్‌తో పాటు మరో ఐదారు మాట్లు ఉన్నాయి. మాట్ల కింద సుమారు 2వేల ఎకరాలు సాగవుతుండగా ఎత్తిపోతల పథకం కింద వేయి
ఎకరాలు సాగవుతాయి.
మోరంచ ఉప్పొంగడానికి కారణమేంటి..?
2023, జూలై 27 బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 3024 మీ.మీ వర్షపాతం నమోదైంది. చిట్యాలలో 620.4మీమీ రేగొండలో,475.4మీమీ, గణపురంలో 462.8మీమీ వర్షపాతం నమోదుకావడంతో చెరువులు , కుంటలకు భారీగా వరద పోటెత్తింది. అయితే ఎగువన ఈశాన్యం వైపు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బుర్గుపేట, మారెడుగొండ చెరువుకు అటవి నుండి వరద రాగా చెరువుకు మూడు చోట్ల గండిపడటం, తూర్పున కొండాపూర్ శివారు సీతారాంపూర్ చిర్రచెరువు కట్ట తెగిపోవడంతో దిగువకు ప్రవాహం పెరుగింది.
ధర్మరావుపేట ఊర చెరువు మూడుచోట్ల పూర్తిగా తెగిపోయింది. ఎల్లారెడ్డిపల్లి చెరువు నుండి భారీగా వరద రావడం, దక్షిణం వైపు నుండి బుధ్దారం శివారు వంగపెల్లివాణి చెరువు మత్తడి భారీగా పటడంతో గణపురం చెరువుకు 5ఫీట్ల మేర మత్తడిపోసింది. దీంతో మోరంచవాగుకు భారీగా వరద పెరిగింది. ఉత్తరంన చెల్పూర్ ఊరచెరువు నుండి భారీ వరద వచ్చి మోరంచలో చేరింది. గాంధీనగర్ జమేదారి కుంట, నుండి భారీగా వరద నీరు సబ్బిడికుంటకు చేరడంతోప్రవాహం ఉదృతంగా పెరిగింది. వాగుకు అన్ని వైపుల నుండి ఒకే సారి వరద పోటెత్తింది. దీంతో మోరంచవాగు ఉగ్రరూపం దాల్చి మోరంచ గ్రామాన్ని చుట్టుముట్టి నిండా ముంచేసింది.
మోరంచపల్లి గ్రామం ముంపుకు కారణాలివేనా..?
సంవత్సరాంతం జీవధారలా ప్రవహించే మోరంచవాగుకు అడ్డంకులు సృష్టించడంతోనే ఈ విపత్తు సంభవించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విభిన్న ప్రశ్నలు సర్వత్రా చర్చజరుగుతున్న అంశాలివే..
ఫిష్ నెట్‌ల వల్లే చెరువులు తెగాయా..!
ప్రధానంగా మోరంచకు నీరందించే చుట్టుపక్కల ఉన్న దాదాపు అన్ని చెరువులకు , కుంటలకు మత్తళ్ళ ప్రదేశంలో చేపలు వెళ్ళకుండా ఫిన్ నెట్ (వైరు, ఐరన్ జాలీలు) ఏర్పాటు చేశారు. దీంతో వచ్చిన వరద మత్తడి పడుతున్న క్రమంలో చెత్త తట్టుకుని సక్రమంగా నీరు బయటకు వెళ్ళకపోవడంతోనే ఆయా చెరువులు, కుంటలు ఓవర్‌ఫ్లో తో తెగినట్లు, ఒక్కసారిగా ఆ నీరు మోరంచలో చేరడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
దొమ్మటిపెల్లి చెరువు కమ్మేయడంతోనే ముంపు..!
మోరంచపల్లి గ్రామంకు సౌత్ వెస్ట్‌లో ఉన్న దొమ్మటిపెట్టి చెరువు జిల్లాలో మూడో అతిపెద్ద చెరువు. ఈ చెరువుకు ఒకేరోజు మూడుచోట్ల గండిపడటంతో భారీగా వరదనీరు మోరంచపల్లి గ్రామం దిగువన మోరంచలో కలిసింది. అయితే ఆ నీరు ఉదృతంగా ప్రవహించే మోరంచకు తీవ్ర అడ్డంకిగా మారడంతో నీరు దిగువకు వెళ్ళలేక మోరంచ ఆ గ్రామాన్ని ముంచేసినట్లు తెలుస్తుంది. మరో పక్క కేటీపీపీ యాష్ ప్లాంట్ వద్ద మోరంచ పక్కన నిర్మించిన కరకట్టతో కూడా నీటి ప్లోను అడ్డుకున్నట్లు తెలుస్తొంది.
హైలేవల్ వంతెన డిజైనింగే ఆ గ్రామానికి ప్రమాదమా..?
గతంలో 2000 సంవత్సరంలో వరదలు వచ్చినప్పటికి ఇంతటి బీభత్సాన్ని సృష్టించలేదని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో వర్షాకాలం మోరంచ ఉదృతి పెరిగినపుడు లోలెవల్ వంతెన, కల్వర్ట్ మీదుగా నీరు ప్రవహించి గ్రామానికి అంతగా ముప్పుఉండేది కాదని, కానీ గత కొద్ది సంవత్సరాల క్రితం మోరంచపల్లి గ్రామం నుండి కుందయ్యపల్లి వరకు సుమారు 1కిలోమీటర్ మేరా 1 హైలేవల్ వంతెన, 1 కల్వర్ట్‌తో జాతీయ రహదారి నిర్మించారు.
గతంలో లోలెవల్ వంతెనతో పోల్చితే ఈ రోడ్డు, వంతెన సుమారు 5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో వాగు ఉదృతి పెరిగినపుడు వాగునీరు బయటకు వెళ్ళకుండా జాతీయ రహదారే కరకట్టగా మారింది. దీంతో నీరు దిగువకు వెళ్లకుండా రివర్స్‌గా ప్రవహించి ఊరును చుట్టుముట్టి ముంపుకు కారణమైందని పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. డిజైనింగ్ మార్చి ఎక్కువ ఫీల్లర్స్‌తో హైలెవల్ వంతెన నిర్మిస్తే ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం..?
వర్షాకలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు జులై 15 వరకు వర్షాలు పడకపోవడంతో రెడ్ అలర్ట్ వస్తుందని అంచనా వేయలేకపోయారు. గతంలో మాదిరిగా గోదావరి తీర ప్రాంతంపైనే వారు దృష్టిసారించడంతో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఈ ప్రాంతం పై లేకపోవడంతోనే ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంకు ముందు ఇరిగేషన్ అధికారులు చెరువులు, కుంటల కట్టలను పర్యవేక్షించి మరమ్మతులు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని.
చెరువు కట్టలు అప్పటికే బలహీనపడంతో అధిక వర్షాలకు వరద తట్టుకోలేక తెగిపోయాయని పలువురు చెబుతున్నారు. దీనితోనే మోరంచ వాగు ఉగ్రరూపం దాల్చిందని వివిధ గ్రామాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా మోరంచపల్లి గ్రామస్థులకు జరగాల్సిన ఆస్తీ, ప్రాణ నష్టం జరిగిపోయింది.ఇప్పటికైన ఉన్నతాధికారులు దృష్టిసారించి ముంపుకు గల కారణాలను తెలుసుకుని మరోసారి జలవిలయం సంభవించకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.