Saturday, November 23, 2024

Big story : కేసీఆర్‌ కిట్‌లో మరిన్ని వస్తువులు.. సీఎం సూచనతో అధికారుల చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన మహిళకు, పుట్టిన బిడ్డకు ప్రభుత్వం ఇస్తున్న కేసీఆర్‌ కిట్‌లో మరిన్ని వస్తువులు చేర్చి ఇవ్వాలన్న ప్రతిపాదనపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో పాటు ప్రసవించిన మహిళ కుటుంబానికి కొంత నగదు ఇచ్చి ప్రోత్సహించే ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని అన్ని వర్గాల మహిళలు గర్భం దాల్చిన సమయంలో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి 2017లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేసీఆర్‌ కిట్‌ పథకానికి అంకురార్పణ చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం అంచనాలకు మించి విజయవంతమైందని సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్‌ శాసనసభ వేదికగా, ఇతర సమావేశాల్లో, బహిరంగ సభల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐదేళ్ల క్రితం ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ పథకంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పది లక్షలకుపైగా కిట్లను ప్రసవించిన మహిళలకు ప్రభుత్వం అందజేసింది. ఈ పథకం విజయవంతం కావడంతో పొరుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు ఈ తరహా పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికార బృందాలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చి కేసీఆర్‌ కిట్‌ పథకంపై అధ్యయనం చేసి వెళ్లారు. ఈ పథకంపై అధికారులు ప్రభుత్వంలోని పెద్దలతో కలిసి వివరాలు సేకరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌లో మరిన్ని వస్తువులు చేర్చాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. కిట్‌లో చీర, టవల్‌, నాప్కిన్‌, పుట్టిన బిడ్డకు దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌, డైపర్లు, పౌడర్లు, షాంపులు, సబ్బులు, బేబీ ఆయిల్‌, దోమ తెర, ఆడుకునే బొమ్మలు, ఐరన్‌ మాత్రలు, ప్రొటీన్‌ పౌడర్‌ పెట్టి ప్రసవించిన మహిళలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళుతున్న సమయంలో ఇస్తున్న సంగతి తెలిసిందే.

కిట్‌లో కొత్త వస్తువులివే…

కొత్తగా ఈ కిట్‌లో అధిక పోషకాలు ఉండే కొన్ని వస్తువులను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రసవించిన మహిళకు మరింత శక్తిని ఇచ్చే ఖర్జూరాలను, డ్రైఫ్రూట్‌లను, సిరప్‌ను ఇవ్వాలని సంబంధిత వైద్యులు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. డ్రైఫ్రూట్లు, ఖర్జూరాలను ఇవ్వడంవల్ల వీటిని ప్రసవించిన మహిళ తింటే ఆమెకు బలవర్ధకమైన ఆహారం అందుతుందని చెబుతున్నారు. ఖర్జూరాలు, డ్రైఫ్రూట్లలో పీచు, ప్రొటీన్‌, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ఐరన్‌, కాపర్‌, విటమిన్‌ బీ6 అందుతాయని వైద్యులు నివేదించినట్టు సమాచారం. ఖర్జూరాలతో పాటు ఆస్టిఫెర్జ్‌-జెడ్‌ అనే సిరప్‌ను కూడా ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ సిరప్‌ తాగితే అమైనో యాసిడ్స్‌ విటమిన్లు, జింక్‌ లభిస్తాయని వైద్యులు అంటున్నారు. దీంతో పాటు ప్రొ-పీఎల్‌ పౌడర్‌ను కూడా ఇచ్చే ఆలోచన పరిశీలనలో ఉంది. ఈ పౌడర్‌ను వాడితే ప్రొటీన్లు, హిమోగ్లోబిన్‌ బూస్టర్లు, ఎముకలు పడే పోషకాలు, విటమిన్లు, మినరల్స్‌ పెరుగుతాయని భావిస్తున్నారు.

ప్రసవాలు పెరిగినందునే..

- Advertisement -

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెద్దఎత్తున జరుగుతుండడంతో సీఎం కేసీఆర్‌ ప్రసవించిన మహిళలకు ఇస్తున్న కేసీఆర్‌ కిట్లలో మరిన్ని వస్తువులు చేర్చాలని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ గర్భిణీ మహిళలు ప్రసవం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఈ పరిస్థితిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించినట్టు సమాచారం. మండల కేంద్రాలు, నియోజకవర్గ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి కేసీఆర్‌ కిట్స్‌ పథకానికి సంబంధించిన వివరాలను తెలియపర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించి వేలకు వేల రూపాయిలు ఫీజులు, శస్త్ర చికిత్స పేరుతో చెల్లించే విధానానికి స్వస్తి పలికే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు చేతి ఖర్చులకు కొంత నగదును ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఎంత మొత్తం ఇవ్వాలన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటించాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ప్రసవించిన మహిళ ఇంటికి తిరిగి వెళ్లాక అనారోగ్య బారిన పడకుండా శక్తినిచ్చే ఔషధాలను, ఇతరత్రా వస్తువులను ఇవ్వాలని త్వరలోనే వీటిని కేసీఆర్‌ కిట్స్‌లో కలిపి అందజేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement