Thursday, November 21, 2024

Big Story: రెండు రోజుల్లో శ్రీశైలానికి కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికల్లా తుంగభద్ర గేట్లు ఎత్తే చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంతోపాటు ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న బారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. గంటగంటకూ నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి, కృష్ణతోపాటు ఉప నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తగా… రెండు రోజుల్లో కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం , నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లు కూడా జలకళను సంతరించుకుకోనున్నాయి. మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయన్న వాతావరణశాఖ సూచన నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు ముందుగానే జలకళ రానుంది. ఎగువన కృష్ణా నదిపై కర్ణాటక రాష్ట్రంలో ఉన్న… అలమట్టి, తుంగభద్ర జలాశయాలకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయానికి ప్రతీ రోజూ దాదాపు 10 టీఎంసీల నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో… తుంగభద్ర గేట్లను సోమవారం సాయంత్రంకల్లా ఎత్తి వరదను దిగువన ఉన్న శ్రీశౖౖెలం ప్రాజెక్టు వైపునకు వదిలే అవకాశం ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం…కర్ణాటకలోని అలమట్టిలో 129.72 టీఎంసీలకుగాను 79.74 టీఎంసీలు, తుంగభద్రలో 100.86 టీఎంసీలకుగాను 82 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. ప్రస్తుతం తుంగభద్రకు 91, 218 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఈ వరద ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తిసామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 44.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 99 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

గోదావరి మహోగ్రరూపం..
వరద పోటెత్తుతుండడంతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చుతోంది. గోదావరితోపాటు ఉపనదులైన పెన్‌గంగ, ప్రాణహిత, పెద్దవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. నదిలో ఆదివారం మధ్యాహ్నానికి 34.8 అడుగులకు నీటి మట్టం చేరింది. గోదావరిలో నీటి ప్రవాశం 5, 75, 619 క్కూసెక్కులుగా అధికారులు అంచనా వేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలంలో గోదావరి తీరాని భక్తులు పోటెత్తుతుండడంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. నిర్మల్‌ జిల్ల కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. జలాశయంలోకి 87, 258 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నిజామాబాద్‌ జిల్లా కౌలాస్‌నాలా గేట్లు ఎత్తడంతో బోధన్‌ మండలం సాలూర వద్ద మంజీర నదికి వరద తాక్కిడి ఎక్కువైంది. వరద దాటికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న వంతెన నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. జిల్లాలోని రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉరకలేస్తోంది. మహారాష్ట్రంలోని బాబ్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులకు లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు 4, 92,000 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీగా వరద వచ్చి చేరుతుండడంతో 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేసమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2,84, 534 టీఎంసీల వరద వచ్చి చేరుతోంది. కాళేశ్వరం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి 15 మీటర్ల మేర ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 75గేట్లు ఎత్తి దిగువకు వరదను అధికారులు విడుదల చేస్తున్నారు. ఇక అన్నారం బ్యారేజీ 50గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ నాల జలాశయం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement