మంగపేట, నవంబర్ 11 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లాలో బీజేపీకి శనివారం బిగ్ షాక్ తగిలింది. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ తన అనుచరులతో కలిసి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో తాటి కృష్ణ తన నివాసంలో తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాటి కృష్ణ మాట్లాడుతూ… తాను బీజేపీలో చేరినప్పటి నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానన్నారు. బీజేపీలో తాను చేరక ముందు ములుగు నియోజవర్గంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, తాను చేరాక బీజేపీ ఎలాంటి పొజిషన్ లో ఉందనేది బీజేపీ అధిష్టానంకే కాకుండా ములుగు నియోజకవర్గ ప్రజలందరికి తెలుసన్నారు. పార్టీలో చేరినప్పటి నుండి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డ తనను చివరి నిముషం వరకు పార్టీ పెద్దలు నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విలేకరులతో మాట్లాడుతున్న క్రమంలో ఓ దశలో తాటి కృష్ణ కన్నీటిని ఆపుకోలేక రోధించారు. ములుగు నియోజకవర్గంలో గత మూడు దఫాలుగా, ఈసారి ఉమ్మడి వరంగల్ లోని మూడు ఎస్టీ నియోజకవర్గాలైన మహబూబాబాద్, డోర్నకల్, ములుగు మూడు స్థానాల్లో కూడా బీజేపీ బంజారా సామాజిక వర్గాలకే టికెట్లు ఇచ్చి ఆదివాసీ (కోయ) సామాజిక వర్గాన్ని విస్మరించిందన్నారు. బీజేపీకి ఆదివాసీలు ఓట్లు మాత్రమే కావలి.. కానీ సీట్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో, తాను ఏం పొరపాటు చేశాననే అంశాలతో పాటు ప్రస్తుతం టికెట్ ఇచ్చిన వ్యక్తికి ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో బీజేపీ అధిష్టానం, నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీలో ఆదివాసీలకు ఆదరణ, గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం తనతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా 150 మంది జిల్లా, నియోజకవర్గ, మండల ముఖ్య నాయకులు బీజేపీకి రాజీనామా చేస్తున్నారని, త్వరలో నియోజకవర్గంలో మండలాల వారిగా తన అనుచరులను, కార్యకర్తలను కలుసుకుని వారి అభిప్రాయం మేరకు ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన జిల్లా, నియోజకవర్గ, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.