హైదరాబాద్ – మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ర్యాష్ డ్రైవింగ్ కేసులో సాహిల్‌ను అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది. పంజాగుట్ట కార్ ప్రమాదం కేసులో సాహిల్ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ కేసుకే ఎల్‌వోసీ జారీ చేశారని,సాహిల్‌పై 15 కేసులు ఉన్నట్టు చూపించారని సాహిల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే చేయని తప్పుకి దుబాయ్ ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారనే భయంతోనే దుబాయ్‌కు వెళ్లినట్లు సాహిల్ న్యాయవాది తెలిపారు.
వాదనలు విన్న హైకోర్టు సాహిల్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈనెల 17న పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సాహిల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అలాగే పంజాగుట్ట కారు ప్రమాద కేసు వివరాలు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.