Saturday, September 7, 2024

Big Figth – రేపే తెలంగాణ బ‌డ్జెట్ – తొలిసారి స‌భ‌కు గులాబీ బాస్

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రతిపక్షనేత కేసీఆర్ రేపు అసెంబ్లీకి రానున్నారు. రేపు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. దీంతో కేసీఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధించిన చర్చలో ఆయన పాల్గొననున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. రేపు ప్రతిపక్షనాయకుడి హోదాలో కేసీఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడుతారు? రేవంత్ సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్న అంశంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారా? కారా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఓ దశలో కేసీఆర్ పార్లమెంట్ కు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న చర్చ సాగింది. అయితే ఆయన ఎంపీగా పోటీ చేయకపోవడంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ నాయకులు సైతం కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని అనేక సార్లు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

కేసీఆర్ హాజరుకాకపోవడంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రేపు హాజరవుతుండడంతో అసెంబ్లీలో రేవంత్, కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం, విద్యుత కొనుగోళ్ల అంశాలపై సైతం కేసీఆర్ అసెంబ్లీ నుంచి క్లారిటీ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ హాజరైతే రేపటి నుంచి శాసనసభ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉందన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement