Tuesday, November 19, 2024

గిరిజన రైతుల పంట భూములకు నీటి సౌకర్యం కల్పించాలి

వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా గిరివికాసం పథకం ద్వారా గిరిజన రైతుల పంట భూములకు బోర్ల ద్వారా నీటి సౌకర్యం కల్పించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గ్రామీణ అభివృద్ధి, భూగర్భ జలవనరులశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో గిరి వికాసం పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాగునీరు సౌకర్యం లేక మోడుబారిన గిరిజన రైతుల పంట భూములకు బోర్ల ద్వారా సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గిరివికాస్ పథకం అమలకు జిల్లాలో 8 కోట్ల 18 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందని అన్నారు. జిల్లాలో అదనంగా పలిమెల, మహాదేవపూర్, కాటారం, మహాముత్తారం, భూపాలపల్లి, గన్పూర్, రేగొండ, చిట్యాల మండలాల్లోని 31 గ్రామాలలో 640 గిరిజన రైతులకు చెందిన 1,233 ఎకరాలకు 218 బోర్లు వేసి మోటార్లను బిగించి విద్యుత్ కనెక్షన్ ఇప్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందని అన్నారు.

ఇప్పటికే గుర్తించిన 31 గిరిజన ఆవాసాల పంటభూములకు విద్యుత్ సరఫరా కొరకు 3 పేజ్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని వెంటనే భూగర్భ జలాలను గుర్తించి బోరు వేయడానికి సరైన పాయింట్ లను ఏర్పాటు చేసేందుకు అధునాతనమైన జియోఫిజికల్ పరికరాలను కొనుగోలు చేసి జియాలజిస్ట్ ల ద్వారా నెలరోజుల్లోగా బోర్ వేసేందుకు పాయింట్లను గుర్తించి వర్షాకాలం ప్రారంభంలోగా బోర్లు వేసి, మోటార్లు బిగించి, విద్యుత్ కనెక్షన్ ఇప్పించి గిరిజన రైతులకు అందజేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి, భూగర్భ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బోర్లు అవసరమన్న గిరిజన రైతులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులు స్వీకరించి నీటి లభ్యతపై ఆయా రైతుల పంట పంట భూములను పరీక్షించాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement