భీంగల్ టౌన్, జనవరి 15 (ఆంధ్రప్రభ) : భీంగల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నవీన్ పై అధికారులు బదిలీవేటు వేశారు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెళ్లడయ్యాయి. ఇటీవల భీంగల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పలు కేసుల్లో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. భీంగల్ కు చెందిన సత్య గంగయ్య తన కేసు విషయంలో తన లొకేషన్ ను సీఐ ట్రేస్ చేసి ఇవ్వడంతోనే తనపై దాడి చేయడం జరిగిందని ఆరోపణలు చేశారు.
తనపై దాడికి పూర్తి బాధ్యత సీఐ దేనని ఆర్మూర్ ఏసీపీ విచారణలో బాధితుడు చెప్పినట్టు సమాచారం. ఈ వివాదం నేపథ్యంలో సీఐని నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెల్లడైనట్టు సమాచారం. సీఐపై వచ్చిన ఆరోపణలపై పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
సీఐలకు కలిసిరాని భీంగల్ స్టేషన్
-ఏడాదిలో ఇద్దరు సీఐ ల బదిలీ
-వివాదాల్లో చిక్కుతున్న సీఐ లు
భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ సీఐలకు కలిసిరావడం లేదు. ఏడాది కాలంలోనే ఇద్దరు సీఐలు వివాదాల్లో చిక్కుకుని బదిలీ అయ్యారు. 2024 జనవరిలో భీమ్‌గల్ సీఐగా నాగపురి శ్రీనివాస్ నిర్మల్ నుండి భీమ్‌గల్ కు బదిలీపై వచ్చారు. వచ్చిన ఆరు నెలల్లోనే ఇసుక వివాదంలో ఇరుక్కుని కేవలం ఆరు నెలల్లోనే జూన్ 2024లో బదిలీ అయ్యారు. నాగపురి శ్రీనివాస్ బదిలీ అయిన తరువాత మెట్పల్లి నుండి భీమ్‌గల్ సీఐగా జూన్ 2024లో బాధ్యత తీసుకున్న సీఐ నవీన్ కుమార్ కేవలం అరునెలల్లోనే జనవరి 14న బదిలీ అయ్యారు. నవీన్ కుమార్ పై భార్య, భర్తల కేసులో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేయడం జరిగింది.
పోలీసులకు తలనొప్పిగా మారిన మీడియేటర్స్..
భీంగల్ పోలీస్ స్టేషన్ ఉదయం నుండి సాయంత్రం వరకు మధ్యవర్థులతో కిటకిటలాడుతుంది. కేసులు దొరికితే మధ్యవర్థులు వదలడం లేదు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు పంచాయతీలు తెంపడమే పనిగా పెట్టుకుంటున్నారు. అమాయక ప్రజలు వీరిని నమ్మి నిలువునా మోసపోతున్నారు. పోలీసుల పేరు చెప్పి వీరి నుండి అందినకాడికి దండుకుంటున్నారు. దాంతో పోలీసులు స్టేషన్ కు వస్తున్నా పలు కేసుల్లో అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు. స్టేషన్ కు వచ్చిన అమాయకులు బయటకు వెళ్లిన తరువాత పోలీసులకు ఇన్ని ఇచ్చామని చెబుతున్నారు. నిజం దేవుడెరుగు కానీ మధ్యవర్థుల కారణంగా పోలీసులకు మరకలు అంటుకుంటున్నాయి.
మీడియేటర్స్ ద్వారా ఎంతో కొంత లాభం రావడంతో పోలీసులు కూడా ఉదాసీన వైఖరి అవలంభించడం జరుగుతుంది. మీడియేటర్స్ కు లాభం.. పోలీసులకు ఆపకీర్తి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సామాన్య ప్రజలు కూడా మీడియేటర్స్ లేకుండా ఏ పని కాదనే అభిప్రాయంతో వారినే ఆశ్రయిస్తున్నారు. ఇది వారికి కలిసి వస్తోంది.