Friday, November 22, 2024

People’s March – ప్రాజెక్ట్ ల పేరుతో భారీ దోపిడి – భట్టి విక్ర‌మార్క

బిజినేపల్లి, ప్రభ న్యూస్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులు పైపులు -పంపుల పేరిట దోచుకోవడం కోసమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 72వ రోజు పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా వట్టెం వెంకటాద్రి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ వెంకటాద్రి ప్రాజెక్టును 33 నెలల్లో కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్‌ ఆనాడు హామీ ఇచ్చి, నేటికీ 90 నెలలు పూర్తి కావస్తున్న పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంతో తేల్చకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉందని తెలిపారు. ఢిల్లీకి వందలసార్లు వెళ్లినప్పటికీ కేంద్రంతో కానీ ట్రిబ్యునల్‌తో మాట్లాడి మన వాటా ఎంతో తేల్చలేని పనికిమాలిన ప్రభుత్వమని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ విభజనలో రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని పార్లమెంట్‌ ద్వారా తెచ్చుకున్న చట్టాన్ని సైతం సాధించకుండా పదేళ్లుగా నిమ్మకు నీరు ఎత్తకుండా తెలంగాణ ప్రభుత్వం కూర్చున్నదని విమర్శలు గుప్పించారు. 95 లక్షల ఎకరాలకు గత ప్రభుత్వాలు సాగునీరు ఇవ్వడానికి కృషి చేయగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి
ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వని అవినీతి ప్రభుత్వమని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా 123 జీవో ద్వారా భూములను బలవంతంగా గుంజుకొని గిరిజనులను, దళితులను, బలహీన వర్గాలను రోడ్డున పడేయడం అమానవీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది కేవలం కల్వకుంట్ల కుటు-ంబం, బీఆర్‌ఎస్‌ నాయకులు బాగుపడటానికి కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ల్యాండు, స్యాండు, మైన్స్‌, వైన్స్‌తో పాటు- బీఆర్‌ఎస్‌ నాయకులు బొందల గడ్డను సైతం వదలడం లేదని విమర్శించారు. బిఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న అక్రమాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ జరిపించి దోపిడీకి పాల్పడిన ప్రజా సంపదను కక్కిస్తామని హెచ్చరించారు. భయంగా బతికే రోజుల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చే ఐదు నెలల్లో తెలంగాణ సమాజాన్ని విముక్తి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో నడుస్తున్న పోలీసు రాజ్యాన్ని పారద్రోలి సామాజిక తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ నిర్మిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మల్లు రవి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు వంశీకృష్ణ, బిజినేపల్లి మండల అధ్యక్షులు సుహాసన రెడ్డి, ఐఎన్‌టీయూసీరాష్ట్ర కార్యదర్శి పర్వతాలు, మల్లేష్‌, అర్దన్‌ రవి, వల్య నాయక్‌ తదితరులతోపాటు- జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఎంపీటీ-సీలు జడ్‌పీటీసీలు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement