ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారం 610 కిలోమీటర్ల మైలురాయిని పూర్తిచేసుకుని 50వ రోజుకు చేరుకున్నది. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 49వ రోజు మే 4వ తేదీ నాటికి 600 కిలోమీటర్లు పూర్తి పూర్తి చేసుకున్నది. విప్లవాల జిల్లా పోరాటాల ఖిల్లగా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన భువనగిరి కి చేరుకున్న క్రమంలో 600 కిలోమీటర్లు పూర్తి కావడం పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భువనగిరి చారిత్రాత్మకం కానున్నది. పాదయాత్ర ప్రారంభమై మే 5న నాటికి 50 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా భువనగిరి నియోజకవర్గం, బీబీనగర్ మండలం గొల్లగూడెం శివారులో పిసిసి జనరల్ సెక్రెటరీ నూతి సత్యనారాయణ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
పలు నియోజక వర్గాల్లో పర్యటన.. సమస్యలు తెలుసుకున్న భట్టి
మార్చి 16న ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని సుమారు 250 పైగా గ్రామాల్లో లక్షల మందిని కలుస్తూ భట్టి విక్రమార్క వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బోథ్ నియోజకవర్గంలో సాగు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న అనేక ఆదివాసీల పల్లెలను కల్లారా చూశారు. కేసులాపూర్ లోని నాగోబా దేవాలయాన్ని సందర్శించి మేశ్ర వంశస్థులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఇంద్రవెల్లి స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించి ఆనాటి పోరాట వీరుల త్యాగాలను వృధా పోనివ్వమని వారు ఏ ఆశయం కోసం ప్రాణ త్యాగం చేశారో కచ్చితంగా ఆ లక్ష్యాలను ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆడ ప్రాజెక్టు సందర్శించారు. బెల్లంపల్లి, చెన్నూరు, నియోజకవర్గంలో బొగ్గు బావులను పరిశీలించి టిఆర్ఎస్ పరిపాలనలో ఆగమవుతున్న సింగరేణిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని అక్కడి కార్మికులకు భరోసా ఇచ్చారు. మంచిర్యాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన గొల్లవాగు ప్రాజెక్టును సందర్శించారు. రామగుండం, ధర్మపురి, హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఆ అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతన్నలకు ఓదార్పు కల్పించారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు క్యాంపస్లో సందర్శించి అక్కడి విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. జనగామ నియోజకవర్గంలోని నర్మెట్ట గ్రామానికి పాదయాత్ర చేరుకునే నాటికి 500 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకున్నది. అన్ని కులాల మఠాలకు కొలువై ఉన్న పర్యాటక ప్రాంతమైన ఆలేరు నియోజకవర్గ పరిధిలోని కొలనుపాక గ్రామాంలో పాదయాత్ర కొనసాగింది. కొలనుపాక గ్రామంలో 2వేల ఏండ్ల నాటి చారిత్రాత్మక దేవాలయమైన సోమేశ్వర నాధుడి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో కొండ కింద నాలుగు వందల ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న డ్రైవర్ల పోరాట దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. భువనగిరి నియోజకవర్గం లో బస్వాపూర్ రిజర్వాయర్ డ్యాముపై బియ్యం తిమ్మాపురం, లప్ప నాయక్ తండ భూ నిర్వాసితులు చేస్తున్న దీక్షా శిబిరాలకు సంఘీభావం తెలిపి వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు. నిర్వాసితుల పరిహారం పునరావసంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.
ఉగాది పండుగను కెరి మేరి మండలం జరి గ్రామంలో, శ్రీరామనవమి వేడుకలు బెల్లంపల్లిలో, రంజాన్ హుజురాబాద్ నియోజకవర్గం లోని శాంతినగర్ కాలనీలో జరుపుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున లక్ష మందితో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సత్యాగ్రహ సభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 50 పైగా గ్రామాల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ స్థానిక ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని ఇందిరమ్మ రాజ్యంలో పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ భట్టి విక్రమార్క తన పాదయాత్రను ముందుకు కొనసాగించారు.
600 కిలోమీటర్లు పూర్తి చేసిన యాత్ర
మార్చి 16న ప్రారంభమైన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 96 కిలోమీటర్లు, మంచిర్యాల జిల్లాలో 134 కిలోమీటర్లు, పెద్దపల్లి జిల్లాలో 75 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 43 కిలోమీటర్లు, హనుమకొండ జిల్లాలో 47 కిలోమీటర్లు, జనగామ జిల్లాలో 57 కిలోమీటర్లు, ఆలేరు నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు, భువనగిరి నియోజకవర్గంలో 30 కిలోమీటర్ల పాదయాత్ర శుక్రవారం రాత్రికి పూర్తి అయింది