కుమ్మరిపేట – మాకు ఇండ్లు లేవు.. భూములు లేవు.. రేషన్ షాపుల్లో ఏమీ ఇస్తలేరు.. మేము ఎట్లా బతకాలో చెప్పండయ్య అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందుకు ఆవేదనగా చెప్పుకున్నారు.. కమ్మరిపేట గ్రామస్తులు, మహిళలు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం పాదయాత్రలో భాగంగా స్థానిక నాయకులతో కుమ్మరిపేటలో వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు, భట్టి విక్రమార్క వద్దకు వచ్చి.. మీతో మా సమస్యలు చెప్పుకోవాలంటూ.. ఆంజనేయస్వామి గుడిపక్కన మర్రిచెట్టుల నీడలో సిమెంటు బెంచీపై కూర్చోపెట్టారు.
అనంతరం మహిళలు దొంతమల్లు వీరమ్మ, గంటం రజని, మద్దెల వెంకవ్వ, సరోజిని మాట్లాడుతూ..మాకు ఇండ్లు లేవు, మా పిల్లలకు ఉద్యోగాల్లేవు, రేషన్ షాపుల్లో సరుకులు ఇవ్వడం లేదన్నారు. దళిత బంధు డబ్బులున్నోళ్లే ఇస్తున్నారు.. మా లాంటి పేదోళ్లకు ఇవ్వడం లేదని ఆవేదనగా చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పోడు భూములు ఇచ్చింది.. ఈ ప్రభుత్వం కొత్తగా పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా.. ధరణి పేరుతో మా భూములు లాక్కుంటున్నారని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.
వారి ఆవేదన విన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు ఇస్తాం. రేషన్ షాపులో బియ్యంతో పాటు అమ్మ హస్తం సంచిలో 9 సరుకులు పెట్టి అందిస్తాం. వంట గ్యాస్ ను రూ. 500కే ఇవ్వడంతో పాటు.. పనిచేసుకునే ప్రతివ్యక్తికి వంద రోజుల పనిని కల్పిస్తాం. వృద్ధాప్య పెంఛన్లు అర్హులందరికీ ఇవ్వడం జరుగుతుంది. కేజీ టూ పీజీ వరకూ ప్రభుత్వంమే ఉచితంగా నిర్భంధ ఇంగ్లీషు మీడియం చదువు చెప్పిస్తుంది. రైతుల పంట రుణాలు రూ. 2 లక్షల వరకూ.. ఏకకాలంలో మాఫీ చేయడం జరుగుతుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ కేలండర్ ను ప్రకటించడంతో పాటు.. పరీక్షా పత్రాలు లీక్ కాకుండా జరిపించి.. కొలువులు ఇస్తాం. కూలీ చేసుకునే వారి కోసం ప్రతి ఏడాది రూ. 12 వేలను కూలీబందు పేరుతో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం ఇందిరమ్మ రాజ్యంలో మాత్రమే సాధ్యమవుతాయి. అందుకే మనమంతా ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి.
కూలీ చేసి చదివించాం.. మా పిల్లలకు కొలువుల్లేవు – సీఎల్పీ నేతతో మహిళల ఆవేదన
బండాతండా గ్రామ శివారులో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమస్యలు చెప్పుకున్న వ్యవసాయ కూలీలు. పాదయాత్రగా వెళుతున్న భట్టి విక్రమార్క కూలీలతో కలిసి నేల మీద కూర్చుని వారు ఏకరవు పెడ్తున్న సమస్యలను ఆసాంతం విన్నారు. మాలపు రాజమ్మ, ధరావత్ లచ్చమ్మ, మారావత్ అనిత మాట్లాడుతూ.. మా పిల్లలను కూలీనాలీ చేసి కష్టపడి చదవించాము.. ఇప్పడు వాళ్లకు నౌకరీలు లేవు.. ఎట్లా బతకాలని అడిగారు. తెలంగాణ తెచ్చుకున్నదే కొలువుల కోసం.. ఈ ప్రభుత్వం మనకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు.. మన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే కొలువులు వస్తాయని భట్టి విక్రమార్క చెప్పారు.