కాల్వ శ్రీరాంపూర్, ఏప్రిల్ 20 (ప్రభన్యూస్): లొంగిపోయిన నక్సలైట్స్‌కు ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుతో బిఆర్‌ఎస్ నాయకులు లాక్కుంటున్నారని సిఎల్‌పి నేత బట్టి విక్రమార్క విమర్శంచారు. కాల్వశ్రీరాంపూర్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు నక్సలైట్స్‌తో జరిపిన చర్చల్లో 104 తీర్మానాలు ఇస్తే అందులో 94 తీర్మానాలను చట్టసభల్లో పాస్ చేయించి లొంగిపోయిన నక్సలైట్లకు గతంలో భూములు ఇచ్చిందన్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో లొంగిపోయి పునరావసంలో నక్సలైట్ల భూములను సైతం వదలకుండా ధరణి పేరిట లాక్కొని వాళ్లను సీఎం కేసీఆర్ ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. అంతర్గాం మండలంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో లొంగిపోయిన నక్సలైట్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను ధరణి పేరట లాక్కుంటు-న్నారని మొరపెట్టుకున్నారని వివరించారు.
అలాగే కాల్వ శ్రీరాంపూర్ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రి చేయాల్సి ఉండగా, 6 పడకలకే ప్రభుత్వం కుదించిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా నడుస్తుందని, ప్రజల సహజ వనరులను దోచుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు ఈ పాదయాత్రలో మూడు లేఖలు రాశానన్నారు. ఈ రాష్ట్రంలో పోడు భూములు అటవీ భూములు అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చి అర్హులకే ఇవ్వాలన్నారు. బొగ్గు బావులను ప్రైవేటు- పరం చేయకుండా బొగ్గు బావుల ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలన్నారు. ఈ రాష్ట్రంలో 54 శాతం బడుగు బలహీన వర్గాలు ఉన్నాయని, సబ్ ప్లాన్ చట్టం తీసుకువచ్చి వారికి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు మూడు లేఖలు పంపించినట్లు- తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంలో ఒక్క గుంట భూమి ఎండనీయకుండా రెండు పంటలకు సాగునీరు అందిస్తామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెల జడ్పిటిసి గంట రాములు, కాంగ్రెస్ నాయకులు అన్వేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గోపగాని సారయ్య గౌడ్, అంతటి అన్నయ్య గౌడ్‌లు పాల్గొన్నారు.