Friday, November 22, 2024

కేసీఆర్ పాలనతో.. రాష్ట్ర భవిష్యత్ అంధకారం – భట్టి

.ప్రయివేటు ఏజెన్సీకి ఔటర్ రింగ్ రోడ్డు
..నిధులను కాజేసేందుకే కాళేశ్వరం
..భూసేకరణ చట్టాలను తుంగలో తొక్కిన కేసీఆర్
..నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి
.. దొంగల పాలవుతున్న రాష్ట్ర సంపద
.. మరో ఉద్యమానికి నాంది పలకాలి
..ఇందిరమ్మ రాజ్యా స్థాపనే లక్ష్యం
..పీపుల్స్ మార్చ్ లో భట్టి విక్రమార్క

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి — రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో తెలంగాణ భవిష్యత్ అంధకార మయ్యిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం లో 49వ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను నిర్వహించారు. ఈ సంధర్బంగా బస్వాపురం డ్యామ్ వద్ద ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి 30 ఏండ్ల వరకు రావాల్సిన పన్నులను ఒకేసారి తీసుకుంటే.. రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నిచారు. మంత్రి కేటీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తెలంగాణకు మణిహారంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటు చేస్తే ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటు ఏజెన్సీ అప్పగించే చర్యను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళతమన్నారు. బాహుబలి ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కాళేశ్వరం నిధులను కాజేయడానికి రీ డిజైన్ చేసిన అతి పెద్ద స్కాం చేశారన్నారు.


పంపులు, పైపుల పేరిట ఖర్చు చేసి ప్రభుత్వ పెద్దలు, దళారులు బాగుపడ్డారే తప్ప తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, రంగనాయక ప్రాజెక్టుల నుంచి నీళ్లు పంపిణీ చేయడానికి మెయిన్ కాలువలు, బ్రాంచ్ కాలువలు ,డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తిచేయకుండా ఎట్లా సాగునీరు ఇస్తారో చెప్పాలన్నారు.


ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం నిధులన్నీ దుర్వినియోగం చేసిందని, తెలంగాణ సంపదను ప్రజలకు కాకుండా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చేస్తున్న దోపిడి పాలన, తెలంగాణ రక్షణ కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సాగునీటి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాక్షసంగా రైతుల నుంచి భూములను బలవంతంగా గుంజుకోవద్దని ఆనాటి యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం తీసుకొచ్చిందని, నేడు రాష్ట్రప్రభుత్వానికి అవేమి అవసరం లేదన్నారు.


రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన ఎకరానికి రూ. 50 నుంచి రూ. 60 లక్షల ధర ఉంటుందని, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ నిర్వాసితులకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం ఎట్లా ఇస్తారని నిలదీశారు.
ముంపునకు గురైన ఊరు ఏ విధంగా ఉందో అదే రూపంతో మరో ఊరుని నిర్మించి నిర్వాసితులకు ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టం లో స్పష్టంగా ఉన్నప్పటికీ ఏమాత్రం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నడని ఆరోపించారు.

- Advertisement -

పొరటంతోనే సమస్యలు పరిష్కారం

పోరాడితే పోయేది ఏమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని మహా కవి అన్నట్లుగా పొరటంతోనే సమస్యలు పరిష్కారామవుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. యాద‌గిరి గుట్ట‌లో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని కుటుంబ సభ్యులతో ద‌ర్శ‌నం చేసుకున్న అనంత‌రం పాద‌యాత్ర‌ కొనసాగించారు. ఈ నేపథ్యంలో గ‌త 405 రోజులు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో డ్రైవ‌ర్లను కలసి సమస్యలను తెలుసుకున్నారు. ఆటోల‌ను కొండ‌పైకి అనుమ‌తించేలా చేయాల‌ని ఆటో డ్రైవ‌ర్లు భట్టిని వేడుకున్నారు. స‌మ‌స్య‌పై పోరాటం చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోయినా.. వ‌చ్చే ఆరునెల‌ల త‌రువాత కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్ప‌డే ఇందిర‌మ్మ రాజ్యంలో ప‌రిష్క‌రిస్తామ‌ని, మీ ఆటోల‌ను తిరిగి కొండ‌పైకి అనుమ‌తిస్తామ‌ని హామీ ఇచ్చారు. పాదయాత్రలో రైతులను, ఆయా కులవృత్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానం చేశారు. కాంగ్రెస్ నేతలు భట్టి అడుగుల్లో అడుగులేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్, బండ్రు శోభారాణి, తగళ్లపల్లి రవికుమార్, పొత్నక్ ప్రమోద్ కుమార్, కోట స్వామి, బుడిగే పెంటయ్య గౌడ్, ఇంజ నరేష్, బల్ల యాదేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement