హుస్నాబాద్ – మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తానని వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమీత్ షాపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు..భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని రాజ ద్రోహం కింద పరిగణించాల్సిందేనని పేర్కొన్నారు.. పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ,
భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమీత్ షా.. రాజ్యాంగ స్ఫూర్తిగా భిన్నంగా మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తానని మాట్లాడటం రాజ ద్రోహానికి పాల్పడినట్టే అని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన కేంద్ర హోం మంత్రి ఇలా మాట్లాడితే ఈ దేశాన్ని ఎవరు కాపాడాలన్న భయం కలుగుతుందని చెప్పారు. అసమానతలతో ఉన్న వర్గాలను సమాన స్థాయికి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ వేసి అత్యంత వెనుకబడి ఉన్న మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిందని,టిఆర్ఎస్ ప్రభుత్వం 12% రిజర్వేషన్ కల్పిస్తానని మరో అడుగు ముందుకేసి వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ తొలగిస్తామన్న బిజెపితో వంత పాడుతూ పార్లమెంట్లో బిజెపి తెచ్చిన చట్టాలకు మద్దతు ఇచ్చేది బిఆర్ఎస్ పార్టీ యేనంటూ భట్టి మండిపడ్డారు.
మైనార్టీల రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉందన్నారు. అమీత్ షా గారు ఒక సారి భారత రాజ్యాంగాన్ని చదవండి అంటూ కామెంట్ చేశారు. ఎస్సీ ఎస్టీల జనాభా ధమాషా ప్రకారం రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరచగా పార్లమెంటు ఆమోదించిందని వెల్లడించారు. కొత్తగా ఎస్సీ ఎస్టీలకు మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదని,. రాజ్యాంగం చదివితే మీకే తెలుస్తుందని అన్నారు. బీసీల జనగణన చేయకుండా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని అమిత్ షా చెప్పడం పెద్ద బూటకమని విమర్శించారు. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అన్ని అవకాశాలు కల్పించేందుకు అవసరమయ్యే జనగణనకు అడ్డుపడుతున్నది బిజెపినే అంటూ భట్టి మండిపడ్డారు.
నాలుగు శాతం ఉన్న ముస్లింల రిజర్వేషన్ తొలగించి 54 శాతం ఉన్న బీసీలకు ఎట్లా ఇస్తారని హోం మంత్రిని ప్రశ్నించారు.
రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని బిజెపి చేస్తున్నది అసత్య ప్రచారమని, సహితుకంగా జన గణన చేసి ఆ సమాచారం నివేదికను ఇచ్చి రిజర్వేషన్ అమలు చేయమని సుప్రీం చెప్పిన మాటలను వక్రీకరించి కాలయాపన చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే ననిఅన్నారు. దేశంలో అన్ని మతాలు, కులాలు ఉమ్మడి కుటుంబం గా కలిసి ప్రశాంత వాతావరణంలో బ్రతికే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డప్ చేయడం వల్ల దేశంలోఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతత నెలకొన్నదని పేర్కొన్నారు. మానస సరోవరం లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలన్న కుట్రలతో ఒక విషం చుక్క వేయాలని అమిత్ షా అడుగు పెట్టారంటూ భట్టి ఫైర్ అయ్యారు.
దేశంలో అల్లర్లు అలజడలు జరగకుండా ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడాల్సిన శాఖకు హోం మంత్రిగా ఉన్న అమిత్ షా కంచే చైన్ మేసినట్టుగా అల్లర్లకు ఆజ్యం పోసినట్టు మాట్లాడటం బాధాకరమన్నారు. పోలీస్ యాక్షన్ తో నిజాం నుంచి తెలంగాణను విముక్తి చేసి దేశంలో విలీనం చేసిన ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, అసమానతలు అవమానాలు వ్యతిరేకంగా ఆత్మగౌరం కోసం పోరాడిన తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన మాజీ హోంమంత్రి షిండే లు కేంద్ర హోం శాఖ ఔన్నత్యాన్ని పెంచితే ఆ శాఖకు ఇప్పుడు హోం మంత్రిగా ఉన్న అమిత్ షా మాట్లాడుతున్న తీరు అవమానపరిచే విధంగా, దిగజార్చే విధంగా ఉన్నదని భట్టి పేర్కొన్నారు.. కెసిఆర్ అవినీతి పరిపాలనపై విచారణ చేయడానికి దర్యాప్తు సంస్థలను చేతుల్లో పెట్టుకొని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,ప్రభుత్వ అలసత్వం నిర్లక్ష్యం వల్లనే ధాన్యం కొనుగోలు జరగడం లేదన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని చేస్తున్నది ఆర్భాటమే తప్ప ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పర్యటన చేసి నెల రోజులు కావస్తున్న పంట నష్ట పోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం లేదన్నారు. అకాల వర్షాలు గాలి దుమారానికి నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ వెంటనే పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం మొక్కజొన్న గాలి దుమారానికి రాలిన మామిడి తోటలకు పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి దొమ్మాటి సాంబయ్య, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీ లు కోట నీలిమ, బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.