మరోసారి గళం విప్పిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి
కేరళలో రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల సమావేశం
ఆంధ్రప్రభ స్మార్ట్, తిరువనంతపురం : రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్ను వాటాను పెంచాల్సిందేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి తన గళాన్ని వినిపించారు.. తిరువనంతపురం లో ఇవాళ జరిగిన 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదని దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కేరళ రాజధాని తిరువనంతపురం లో ఈ కాంక్లేవ్ నిర్వహించారు.
కేరళ సీఎం అధ్యక్షతన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి అందిస్తున్న పన్నుల ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు 41 శాతం మాత్రమే అందుతుందని, దీన్ని కనీసంగా 50 శాతానికి పెంచాలని పలు రాష్ట్రాలు 16వ ఫైనాన్స్ కమిషన్‌కు నివేదించాయి. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను 16వ ఫైనాన్స్ కమిషన్ సేకరిస్తున్నందున న్యాయమైన వాటాకోసం ఒత్తిడి పెంచేలా పలు రాష్ట్రాలు ఈ కాంక్లేవ్‌లో పాల్గొన్నాయి. దీనిలో పాల్గొన్న భట్టి కేంద్రం ఇప్పుడు ఇస్తున్న 41 శాతం వాటాను 50శాతానికి పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.. రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం పొందుతూ, అదే రాష్ట్రాలకు కేంద్రం అతి తక్కువ నిధులు ఇస్తుందని భట్టి అన్నారు.