పెద్దకొత్తపల్లి, ప్రభన్యూస్: కోట్లాది ప్రజలు రోడ్లపైకి వచ్చి సామూహికంగా కలిసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలను భయ పెట్టి పాలించడం కాదని, ప్రజల హృదయాలను గెలిచి పాలించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని చంద్ర కళ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పుడు కోట్లల్లో ఉన్న మిగులు బడ్జెట్ తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నదాన్ని ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పుల్లోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దక్కిందన్నారు. రైతులు అప్పుల పాలు కావద్దని, ఆత్మహత్యలు చేసుకో వద్దని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినప్పుడు పోలీసుల బందోబస్తు ఎందుకని ఆయన ముఖ్యమంత్రి మంత్రులను ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు పోలీసులు వెంట లేకుండా ప్రజల వద్దకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అంటూ పోలీస్ ఎస్కార్ట్ లేకుండా తిరిగితే తెలంగాణ రాష్ట్రంలో మీ పరిస్థితి ఏంటో మీకే అర్థం అవుతుందన్నారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అచ్చంపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించే గొంతుకలను ముందస్తుగా అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజల తమ గోడును చెప్పుకుందామంటే మంత్రి హరీష్ రావు దగ్గరకు రానీయకుండా కలవకుండా ప్రారంభోత్సవాలు చేసుకోవడం దేనికోసంఅని ప్రశ్నించారు. నిజాం ప్రభుత్వాన్ని తలపించే విధంగా తెలంగాణలో పరిపాలన సాగిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మంత్రి హరీష్ రావు అచ్చంపేటకు రాక సందర్భంగా రావలసిన బిల్లులు అడగాలని అనుకున్న సర్పంచ్ లను ముందస్తు అరెస్టుతో హౌస్ అరెస్టు చేయడం ఇంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు చెక్ పవర్ రద్దు చేస్తామని సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తామని బ్లాక్మెయిలింగ్ చేసే బిఆర్ఎస్ ప్రభుత్వానికి సర్పంచులు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని సర్పంచులు ఎంపీటీ-సీలు ఎవరు కూడా అధైర్య పడవద్దని త్వరలో ఐదు నెలల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. నాగర్ కర్నూల్ లో కలెక్టర్ ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి గత ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను బలవంతంగా గుంజుకొని కార్యాలయాలు నిర్మించడం వారి జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టు-కుంటే సరిపోదన్నారు. భారత రాజ్యాంగానికి భిన్నంగా పరిపాలన చేస్తున్న బిఆర్ఎస్ పాలనకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.