Monday, November 18, 2024

TS : శ్రీరామనవమికి భ‌ద్రాద్రి ముస్తాబు…నేడు ఎదురుకోలు వేడుక‌

భ‌ద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణానికి శ్రీరామ దివ్య క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కల్యాణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇవాళ ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

17న జరిగే శ్రీ రామనవమి కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రామాలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగే మిథిలా కళ్యాణ మంటపాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు.

నేడు ఎదురుకోలు వేడుక‌…
భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రేపు మిధిలా స్టేడియంలో సీతారామ కల్యాణం జరగనుంది. రేపు సీతారామ కల్యాణం… సీతారామ కల్యాణం సందర్భంగా పెద్దయెత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఇప్పటికే భద్రాద్రి బాట పట్టారు. భద్రాచలంలోని అన్ని వసతి గృహాలు బుక్ అయి పోయాయి. సీతారామలు కల్యాణాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీస్తుండటంతో అందుకు తగినట్లు చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి వచ్చే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ సారి స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి వచ్చే వీలు లేనట్లు తెలుస్తోంది.
రూ.3 కోట్ల వ్యయం..
దేవాదాయ శాఖ రూ.2.88కోట్లు, గ్రామ పంచాయతీ రూ. 26 లక్షలు, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం రూ.3 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. స్వామి వారి కళ్యాణానికి మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో యుద్ధ ప్రాతి పదికన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. రాములోరి కళ్యాణానికి దేశ నలు మూలల నుంచి లక్ష మందికిపైగా భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి….
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే రామాలయ ప్రాంగణానికి రంగులు దిద్ది సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ అలంకరణలతో రామాలయ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలుగొందుతోంది. సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా కళ్యాణ మంటపానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. కళ్యాణం వీక్షించేందుకు కళ్యాణ మంటపంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులకు ప్రత్యేక సెక్టార్లను ఏర్పాట్లు చేశారు. కళ్యాణం వీక్షించే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా సెక్టార్లలో సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు దేవస్థానం అధికారులు 250 క్వింటాళ్లతో రెండున్నర లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక‌, వాహనాల పార్కింగ్ కోసం 8 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. 256 మరుగుదొడ్లను 14చోట్ల ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా భద్రాచలం పట్టణాన్ని 15జోన్లుగా విభజించి 300 మంది సిబ్బందితో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రత్యేక కౌంటర్లు…
స్వామి వారి కళ్యాణ క్రతువు పూర్తయిన వెంటనే దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వీటిని భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తలంబ్రాల ప్యాకింగ్ కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ముత్యాలతో కూడిన తలంబ్రాలను ఈ సారి కార్గో, పోస్టల్ శాఖల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాములోరి తలంబ్రాలు కలిపే ప్రక్రియ ప్రారంభం కావడంతో కళ్యాణానికి వచ్చే ప్రతి భక్తునికి తలంబ్రాల ప్యాకెట్లను అందించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. గోదావరి బ్రిడ్జి నుంచి రామాలయం ప్రాంగణం వరకు ప్రతి జంక్షన్లో తలంబ్రాలు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు రెండున్నర లక్షల లడ్డు ప్రసాద పాకెట్లను సిద్ధం చేస్తున్నారు.
రక్షణ వలయంలో భద్రాద్రి..
శ్రీ సీతారాముల కళ్యాణానికి దేశ నలు మూలల నుంచి విచ్చేసే వీఐపీలు, వీవీఐపీల కోసం అధికారులు భారీ పోలీసు బందోబస్తు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వామి వారి కళ్యాణానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశాలు ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దున ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు చురుకుగా సాగుతున్న నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.అలాగే సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణ కోసం కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
ప్ర‌ముఖుల రాక‌….
కల్యాణానికి, పట్టాభిషేకానికి రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు గవర్నర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. లోక కళ్యాణార్ధం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ రామ దివ్య క్షేత్రంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సీతారాముల కళ్యాణానికి గడువు సమీపిస్తుండటంతో భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, దేవస్థాన ఈవో రమాదేవి, గ్రామ పంచాయతీ అధికారులు, ఆర్ డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement