ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యం అంటేనే ప్రజలు భయపడతారు. ప్రభుత్వాస్పత్రులో వైద్యంపై ప్రజలకు నమ్మకం ఉండదు. అందుకే వారు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన చికిత్స అందుతుందంటూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలని ప్రభుత్వాలు, అధికారులు కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ తన భార్యకు గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీత్ సతీమణి మాధవి భద్రాచలం ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం మగశిశువుకు జన్మనిచ్చారు. హోదా, అధికారం ఉన్నప్పటికీ సామాన్యురాలిలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజలకు విశ్వాసం కలిగించే ఉద్దేశంతోనే కలెక్టర్ తన భార్యను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్ 2017లో జరిగిన సివిల్స్ పరీక్షలో దేశంలోనే మొదటి ర్యాంక్ సొంతం చేసుకున్నారు.
కాగా, ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలతో ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ ఆమె ప్రభుత్వాస్పత్రిలో గత నెల 21న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పురిటి నొప్పులు రావడంతో ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చిన స్నేహలత.. అక్కడే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో డెలివరీకి సిద్ధమయ్యారు.