Saturday, November 16, 2024

TG: భారీ వర్షంతో భద్రాచలం అతలాకుతలం..

-పలుచోట్ల రోడ్లపైకి వరద నీరు
భద్రాచలం, ఆగస్టు 7 (ప్రభ న్యూస్): భద్రాచలం పట్టణంలో కురిసిన భారీ వర్షంతో పలుచోట్ల వరద నీరు నిలిచి ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా అయ్యప్ప కాలనీ, ఏఎస్ఆర్ కాలనీ, రామాలయం ప్రాంతంలో వరద నీరు రోడ్లపైకి వచ్చాయి. రామాలయ విస్తా కాంప్లెక్స్ వద్ద స్లూయిస్ గేట్ల వద్ద ఉన్న మోటార్లను ఆరంభించకపోవడంతో, బ్యాక్ వాటర్ ఒత్తిడి పెరగటంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. రామాలయానికి పడమర వైపు మార్గమంతా వరద నీటితో నిండిపోయింది. రామాలయ నిత్య అన్నదాన సన్నిధిలోకి కూడా నీరు చేరింది. సుమారుగా అడుగుమేర నీరు చేరటం కనపడింది. పడమర మార్గం నుంచి మిథిలా స్టేడియం వరకు వరద నీరు ఆగిపోయింది.

అయ్యప్ప కాలనీలో సైతం వరద నీరు చేరగా, కాలనీవాసులు భయభ్రాంతులకు గురై సామాజిక మాధ్యమాల్లో కాలనీని కాపాడాలంటూ విన్నపం చేశారు. ఎల్ఐసి ఆఫీస్ మార్గం నుంచి ఏఎస్ఆర్ కాలనీకి వెళ్లే మార్గంలో మురుగునీరు రోడ్లపైకి చేరింది. ఈ ప్రాంతంలోకి పట్నంలోని పలుచోట్ల నుంచి వచ్చే వరదనీరు, మురుగునీరు చేరుతుంది. అయితే దిగుకుకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులకు, ఎమ్మెల్యేకు వినతులు అందించినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా మంత్రి తుమ్మల సైతం రాములయ్య ప్రాంతంలో బ్యాక్ వాటర్ సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచల పట్టణ పరిధిలో మురుగునీటి వ్యవస్థపై శాస్త్రీయ అధ్యయనం జరగనంత వరకు ఈ సమస్య ఇలాగే ఉండనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement