Thursday, September 19, 2024

Bhadrachalam – గోదావ‌రి వ‌ర‌ద‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి…. మంత్రి తుమ్మ‌ల ..

భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఇక్కడి వరద ఉద్ధృతిని పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియ, గోదావరి కరకట్ట వద్ద వరద ఉద్ధృతి, కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో నీటి పారుదల, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, అగ్రికల్చర్, విద్యుత్, వైద్య శాఖల అధికారులతో సమీక్షించారు. వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. గోదావరిలో నీటి ప్రవాహం 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు వరద ఉద్ధృతిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టామని అన్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ భద్రాద్రి నాది.. నా సొంతం అని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకి ఆదేశించారు.. జిల్లా మొత్తం తుఫాను వరదల ప్రభావంగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి.. బాధితులకు వెంటనే డబ్బులు అందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కి మంత్రి సూచనలు చేశారు. రాముడు కరుణిస్తే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని.. రాజకీయపరంగా అధికారం పరంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాములవారికి సేవ చేసుకోవాలని తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఇక, ఈ తుఫాను వరదల కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగాలకి తుమ్మల అభినందనలు తెలిపారు. గతంలో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లుగా పని చేసిన అనేక మంది ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కేంద్రస్థాయిలో ఉన్నత స్థాయిలో పని చేస్తున్నారు అని గుర్తు చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారులు అందరూ భద్రాచలంపై ప్రేమను చూపిస్తున్నార‌ని,.. ఇప్పటికీ త‌న‌కు ఫోన్ చేసి సార్ మన భద్రాద్రి, ఎలా ఉంది అని అడుగుతున్నార‌ని వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement