Thursday, November 21, 2024

తెలంగాణలో మెరుగైన వైద్యం.. పేదలకు ఫ్రీగానే డయాలసిస్ సేవలు..

ప్ర‌భ‌న్యూస్: కిడ్నీ వ్యాధిగ్రస్తులైన ఎయిడ్స్‌, హైపటైటిస్‌ రోగులకు ఉచిత డయాలసిస్‌ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య శ్రీ సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా నిర్ణయంతో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో ప్రత్యేక డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు మంత్రి హరీష్‌రావు ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే ఈ రెండు కేంద్రాల్లో ఐదు బెడ్స్‌ ఎయిడ్స్‌ పేషెంట్లకు, ఐదు బెడ్స్‌ హైపటైటిస్‌ పేషెంట్లకు కేటాయించి డయాలసిస్‌ సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు కేర్‌పై బీఆర్‌కే భవన్‌లో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ చేయించుకోవడం ఆర్థికంగా చాలా భారంగా పరిణమించిన నేపథ్యంలో… సీఎం కేసీఆర్‌ ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలసిస్‌ కేంద్రాలు నడుస్తున్నాయని, వీటి ద్వారా పదివేల మంది రోగులకు డయాలసిస్‌ సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో కిడ్నీ వ్యాధితో బాధ పడే ఎయిడ్స్‌, హైపటైటిస్‌ పేషెంట్లకు సైతం సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు డయాలసిస్‌ సేవలు ఉచితంగా అందించాలన్నారు. రోగుల సంఖ్యకు తగ్గినట్టుగా డయాలసిస్‌ మెషిన్లను ఏర్పాటు చేసి, వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. ఇకముందూ ఎయిడ్స్‌, హైపటైటిస్‌ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ ప్రీతి మీనా, ఓఎస్డీ డాక్టర్‌ గంగాధర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement