Wednesday, November 20, 2024

సంక్షేమ హాస్టళ్ళలో మెరుగైన వసతులు.. పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత విజయాలు సాధించాలి : కొప్పుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సంక్షేమ హాస్టళ్ళలో వసతులు మెరుగుపర్చే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. హాస్టళ్ళలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, సౌరశక్తితో నడిచే వాటర్‌ హీటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఎస్సీ సంక్షేమ శాఖ, స్టడీ సర్కిళ్ల పనితీరుపై అధికారులతో మంత్రి కొప్పుల సమీక్షించారు. ఈ సమీక్షలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగితా రాణీ, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. సివిల్స్‌, గ్రూప్‌ వంటి పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత విజయాలు సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఎస్సీ యువత తమ రిజర్వేషన్‌ కోటాలోనే కాకుండా ఓపెన్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దాలని అధికారులకు ఆయన సూచించారు. అత్యుత్తమ ఫలితాలు రాబెట్టేందుకు అవసరమైతే ప్రత్యేక నిపుణలతో శిక్షణ ఇప్పించాలన్నారు. ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్స్‌ను త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు సహజ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి అధికారులకు మంత్రి కొప్పుల వివరించారు. చౌకగా లభించే ఆ ఉత్పత్తులను గురుకులాలు, హాస్టళ్ళకు అందజేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement