Sunday, October 6, 2024

TG | గాంధీ, ఉస్మానియాలో మెరుగైన వసతులు : మంత్రి దామోదర

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు… గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పటిష్టతపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని 12 ప్రముఖ ఫార్మా కంపెనీల అధినేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ…

రాష్ట్రంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు సామాజిక బాధ్యతగా సీఎస్‌ఆర్ నిధులను కేటాయించి సుదీర్ఘ చరిత్ర, చారిత్రక నేపథ్యం ఉన్న ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల పూర్వ వైభవానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, రోగులకు మెరుగైన వైద్యసేవలు, ఆసుపత్రుల్లో పరిసరాల పరిశుభ్రత, రోగులకు నాణ్యమైన ఆహారం, ఆసుపత్రుల్లో సేవలందించేందుకు సరిపడా మ్యాన్ పవర్, లాండ్రీ, బయో మెడికల్ వేస్ట్, తాగునీరు సౌకర్యాలతో పాటు విద్య & ఆరోగ్యం, బాలికా విద్య లాంటి ప్రాధాన్యతా రంగాలలో CSR నిధులు విడుదల చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం… వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచనల మేరకు రాష్ట్రంలోని 12 ప్రముఖ ఫార్మా కంపెనీల ఫండ్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతులు ఈ వారం ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను స్వయంగా సందర్శించనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాధాన్య అంశాలపై సాంకేతిక నివేదిక సమర్పించనున్నారు.

ఈ సందర్భంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల రోగులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించేందుకు మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అందజేయాలని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ను రాష్ట్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, మైలాన్ లేబొరేటరీ నుండి మిచెల్ డొమినికా, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నుండి కె.రఘురామన్, నాట్కో ఫార్మా నుండి ఎం వంశీకృష్ణ, భారత్ బయో ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుండి ప్రవీణ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ నుండి శ్రీనివాస్ రెడ్డి, అరబిందో ఫార్మా లిమిటెడ్ నుండి పి.హరీష్ బాబు, హిట్రో డ్రగ్స్ నుండి ఎం. సుధాకర్ – బాయిలజికల్. ఇ లిమిటెడ్ నుండి కృష్ణ చైతన్య, ఎంఎస్‌ఎన్ లాబొరేటరీ నుండి సురేందర్ రెడ్డి, డివిస్ లేబొరేటరీ నుండి కె.సుబ్బారావు, విర్కో డ్రగ్స్ నుండి ప్రవీణ, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నుండి లోకేష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement