అసాంఘిక శక్తులకు ఆదివాసీలు ఎప్పుడు సహకరించవద్దని బెల్లంపల్లి ఏసీపి మహేష్ కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, ఓఎస్డీ శరత్ చంద్ర పవార్, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డిల ఆదేశాల మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏసీపీ పర్యటించారు. మంగీ, తిర్యాణి ప్రాంతాలకు అనుకోని ఉన్న మంచిర్యాల జిల్లా దేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివాసీ, కోలం, గిరిజన ప్రజలు కుర్రె గూడ, కొలాంగూడ, లక్ష్మిపూర్, వెంకటాపూర్ గ్రామాలను సందర్శించి, స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగు గ్రామాల్లోని 200 కుటుంబాలకు ఒకటి చొప్పున దుప్పట్లను బెల్లంపల్లి ఏసీపీ మహేష్ అందించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మావోయిస్టుల సిద్ధాంతాలు నమ్మి వారి బాటలో వెళ్లి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని స్థానిక యువతకు పిలుపునిచ్చారు. జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దన్నారు. ప్రజలు ఎవరూ మావోయిస్టులకు సహకరించ వద్దు తెలిపారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు.