Saturday, November 23, 2024

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌! విద్యార్థులకు సెలవులివ్వకుండా ఆన్‌లైన్‌ క్లాసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం విధ్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తే.. కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు మాత్రం విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులను నిర్వహిస్తున్నాయి. మూడు రోజులు సెలవులివ్వాలనే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ కొన్ని పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తుంటే, మరికొన్ని పాఠశాలలు మాత్రం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడుతుంటే మరోవైపేమో ఆన్‌లైన్‌ తరగతులను ప్రైవేట్‌ స్కూళ్లు తమపని తాము చేసుకుంటున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మొదట జులై 11 నుంచి 13 వరకు సెవులను ప్రకటించింది. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడవంతో ఆతర్వాత మళ్లిd మరో మూడు రోజులు పొడిగిస్తూ ఈనెల 14 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించినప్పటికీ ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను కొనసాగిస్తున్నాయి. జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడి చికటిలోనే ఉన్నాయి. హాలిడే మూడ్‌లో ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులపై ఆసక్తి చూపడం లేదు. కరెంటు కోతలతో, ఇంటర్‌నెట్‌ సమస్యలతో ఆన్‌లైన్‌ తరగతులకు కనెక్ట్‌ కావడం కష్టంగా మారుతోంది.

ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా క్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడం కష్టమవుతోందని విద్యార్థులు చెప్తున్నారు. ఒకే ఇంటిలో ఇద్దురు విద్యార్థులు ఉంటే ఒక ఫోను మాత్రమే అందుబాటులో ఉండడం ద్వారా ఒక విద్యార్థి మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులను వినాల్సి రావడంతో మరోక విద్యార్థి నష్టపోతున్నారు. ఇదంతా ఫీజులను వసూలు చేసేందుకే ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఈ వారం మొత్తం పాఠశాలలు బంద్‌ కావడంతో సోమవారం నుంచి మళ్లి పున:ప్రారంభం తర్వాత టర్మ్‌ ఫీజులు, నెలవారి స్కూల్‌ ఫీజులు వసూలు చేసేందుకే ఈవిధమైన హాడావుడిని ప్రైవేట్‌ బడులు చేస్తున్నాయని అంటున్నారు. గత రెండు సంవత్సరాలు దాదాపు ఎక్కువగా ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగాయి. దాంతో ఆన్‌లైన్‌ తరగతులు మళ్లి వినడానికి విద్యార్థులు ఇష్టపడట్లేదు. కొన్ని స్కూళ్లయితే నర్సరీ, ఎల్‌కేజీ నుంచే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని మాత్రం ప్రైమరీ తరగతులకు సెలవులిచ్చి, హై స్కూల్‌ విద్యార్థులకు 10 నుంచి 30 నిమిషాల విరామంతో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో ఎల్‌కేజీ విద్యార్థులకు మాత్రం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటున్నాయి. 2 క్లాసు విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇంటర్‌ విద్యార్థులకు సైతం పలు కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులను ఈనెల 11 నుంచే ప్రారంభించేశాయి. విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయో లేదో చూడకుండా సిలబస్‌ను లాగించేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement