ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో ఇవ్వాల జరిగింది. దీంతో పలువురికి గాయాలపాలై దవాఖానలో చికిత్సిపొందుతున్నారు. చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామంలోని పెద్ద చెరువు కట్ట పై ఉపాధిహామీ పనుల్లో భాగంగా జంగిల్ కటింగ్ చేసేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఉదయాన్నే 150 మంది కూలీలు పెద్ద చెరువు కట్ట పై చెట్లు, పిచ్చిమొక్కలు తొలగించే పనులు ప్రారంభించారు.
కట్టపై ఉన్న చెట్లను ఒక్కొక్కటిగా తొలగిస్తున్న క్రమంలో తేనెతెట్టె ఉన్న విషయాన్ని గుర్తించకుండా ఉపాధి కూలీలు చెట్టును కొట్టారు. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు కూలీలపై దాడి చేశాయి. ఈ ఘటనలో 25 మంది కూలీలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూలీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.