మోత్కూర్, (ప్రభన్యూస్) : అసలే గుంతల రోడ్లు… ఆ పై నిత్యం వందలాది ఓవర్ లోడ్ ఇసుక లారీల రాకపోకలు… ప్రయాణికుల ఇక్కట్లు… నిత్యం ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ జాం… యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్థకొండూర్, అడ్డగుడూర్ మండలం చిర్రగూడూరు, గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇసుక రీచ్ల ద్వారా నిత్యం వందలాది ఓవర్ లోడ్ ఇసుక లారీలు పాటిమట్ల రోడ్, అనాజీపురం రోడ్, టి షాపురం మీదుగా జామాచెట్ల బావి రోడ్ నుండి మున్సిపల్ కేంద్రంలోకి ప్రవేశించి భువనగిరి నుండి రాజధాని హైదరాబాద్కు నిత్యం వెళ్తుండడంతో ఆయా బిటి రోడ్లు అధ్వాన్నంగా మారుతున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఎలాంటి సమయ పాలన లేకుండా వెళ్తుండడంతో మోత్కూర్ బిక్కేరు సింగిల్ బ్రిడ్జి పై, సర్వేపల్లి స్టేజి కల్వర్టు వద్ద ట్రాఫిక్ జాం అవుతూ, పట్టణంలో విపరీతమైన స్పీడ్తో వాహనాలు వెళ్తుండడంతో ప్రమాదాలు, వ్యాపార దుకాణాల్లో దుమ్ము, ద్విచక్ర వాహన దారులకు కంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
జిల్లా స్థాయిలో ఆర్అండ్బి, ఆర్టిఏ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మోత్కూర్ నుండి భువనగిరికి వెళ్లే మార్గంలో ఎన్నో ఏళ్లుగా గుంతల రోడ్డుతో ఇక్కట్లు- పడుతుండగా, కోట్లాది రూపాయలతో ఆత్మకూరు మండలం కాటపల్లి, చాడ, ఆత్మకూర్ మార్గాల్లో జరుగుతున్న నూతన బిటి రోడ్డు పనులకు సైతం ఈ లారీల ప్రయాణం ఇబ్బందిగా మారింది. వందలాది లారీల రాకపోకలతో ఇటీవల పోస్తున్న కొత్త రోడ్లు సైతం దెబ్బ తింటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైనింగ్, ఆర్టిఏ నిబంధనలు ప్రకారం బాడీ లెవల్ ఇసుక తీసుకెళ్ళాల్సిన లారీలు, అధికారుల మామూళ్ల మత్తుతో ఓవర్ లోడ్ ఇసుక లారీలకు అడ్డుకట్ట లేదు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు నిబంధనలు అతిక్రమిస్తున్న ఇసుక లారీలపై ఆర్టిఏ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదంటే వారి పని తీరుకు ఇదే నిదర్శనమని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి మైనింగ్, ఆర్టిఏ, ఆర్అండ్బి అధికారులు ఓవర్ లోడ్ ఇసుక లారీలపై కొరడా జలిపించి కఠిన చర్యలు తీసుకొని ట్రాఫిక్ జామ్, బిటిరోడ్లు దెబ్బతినకుండా, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital