Tuesday, November 26, 2024

TS : కామారెడ్డిలో బెంబేలెత్తిస్తున్న భ‌ల్లూకం

కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారంతో స్థాన‌కులు బెంబేలెత్తుతున్నారు. మత్తడి పోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో మండల కేంద్రం సమీపంలోని ఎర్రమన్ను కుచ్చ అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఇటుక బట్టీల ప్రాంతంలోని గుంతలో నీరు తాగి తిరిగి వస్తుండగా గ్రామస్తులు గమనించారు.

పెద్దవాగులో నీరు తగ్గుముఖం పట్టడంతో దాహం తీర్చుకునేందుకు ఎలుగుబంట్లు వాగు దాటుతుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

గత కొన్ని రోజులుగా రోజూ నీళ్లు తాగేందుకు వచ్చి వెళ్తున్నట్లు తెలిపారు. ఎలుగుబంటి రాకుండా అటవీశాఖ అధికారులు సాసర్ పిట్లలో నీరు నింపాలన్నారు. మత్తడి పోచమ్మ ఆలయానికి ప్రతిరోజూ అనేక మంది భక్తులు వెళ్తుంటారని, అలాగే మేకలు, గొర్రెల కాపరులు, మహిళలు తునికాకు కోసం అడవికి వెళ్తారని తెలిపారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఈనెల 6వ తేదీన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతలగుట్ట తండా శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా తండా పక్కనే ఉన్న చెరువులో నీరు తాగేందుకు వస్తున్న ఎలుగుబంటిని ఆదివారం సాయంత్రం కొందరు యువకులు వీడియో తీశారు. ఎలుగుబంటి సంచారంతో బోనాల్, మెంగారం గ్రామాల ప్రజలు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement