Friday, November 22, 2024

డ్యాన్స్ పోటీల్లో ద‌డ‌పుట్టించిన బీసీ స్టూడెంట్స్‌.. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లపై ఇంట్రస్ట్​

చేతివృత్తుల్లో సృజనాత్మకతను కనబరుస్తూ సమాజాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న బీసీ వర్గాల పిల్లలు చదువులతో పాటు సాంస్కృతిక కళా వారసత్వంలో ప్రతిభను చాటుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో లలిత కళల్లో మంచి ప్రావీణ్యం సాధించారు. అతి తక్కువ కాలంలో శిక్షణ ఇచ్చినప్పటికీ వారిలో దాగిన ప్రతిభకు మెరుగులు పెట్టి కళాకారులుగా తమ సత్తా చాటారు. సాంస్కృతి కార్యక్రమాలతో పాటు అనంతవిశ్వంపై ఆసక్తిని కనబరిచారు. కొన్ని రోజులుగా జిల్లా స్థాయిలో నిర్వహించిన నృత్య పోటీల్లో ఎంపికైన వారితో రాష్ట్ర రాజధానిలోని రవీంద్రభారతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం నిర్వహించారు.

ఈ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు ఔరా అనిపించేలా ప్రదర్శన ఇచ్చి ప్రముఖ నృత్యగురువులైన న్యాయనిర్జేతల చేత భేష్ అనిపించారు. బిసి హాస్టల్ విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదని మరోసారి నిరూపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిసి హాస్టల్స్ నుంచి ఎంపిక చేసిన మూడు వందల మంది విద్యార్థులు 45గ్రూప్ లుగా తమ నృత్యాన్ని ప్రదర్శించారు, ఇందులో నాగర్ కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రదర్శించిన “భారత్ మాతాకి జై” నృత్యం ప్రధమ బహుమతి అందుకోగా, కామారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రదర్శించిన “అల్లానేరేల్లో “ నృత్యం రెండవ బహుమతి గెలుపొందింది. మెదక్ జిల్లా విద్యార్ధులు ప్రదర్శించిన “తూరుపు కొండల్లో” నృత్య ప్రదర్శన మూడో బహుమతి అందుకుంది.

సాహిత్యవారధులు వీరే
సాహిత్యాన్ని, కళలను రేపటి తరానికి అందించాలంటే ఈతరం పిల్లలకు వాటిని చేరువ చేయాలని అందులో భాగంగానే బిసి హాస్టల్ విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా కళల్లో శిక్షణ ఇచ్చామని బిసి వెల్పేర్ డిపార్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. కళలు చిన్నారుల్లో ఏకాగ్రతను, మానసిక ప్రశాంతత ను, ఆత్మవిశ్వాసాన్నిపెంచుతాయన్నారు. వారి వారి ప్రాంతీయ అస్తిత్వానికి , సాహిత్వ వికాసానికి వారధులు చిన్నారులే అని ఆయన ప్రశంసించారు. చిన్నారుల్లో దాగిన ప్రతిభను గుర్తించి తగిన శిక్షణ ఇస్తే అంతరీక్షంలోకైనా వెళ్లతారని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, బిసి సంక్షేమ శాఖ మంత్రిగారి ప్రోత్సాహంతో రానున్న ఐదేళ్ల కాలంలో బిసి విద్యార్థులను శాస్రవేత్తలుగా రోదసీ లక్ష్యంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. బిసి విద్యార్థుల నుంచి పదిమందిని ఇస్రోకు, మరో పదిమందిని నాసాకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. ఇందుకోసం అంతరీక్ష శాస్త్రవేత్త రఘునందన్ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందిస్తారన్నారు.

అంతరీక్ష పరిశోధనల్లో చేయూత..
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడం ద్వారా వారిని అత్యున్నత స్థాయికి చేర్చవచ్చని అంతరిక్ష శాస్త్రవేత్త, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. రఘునందన్ అన్నారు. విశ్వంలోని వింతల గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఎంతో జిజ్ఞాస ఉంటుందని, వారి సందేహాలను తీర్చి పరిశోధనల వైపు మళ్లిస్తే ఎందరో శాస్త్రవేత్తలను తయారు చేయవచ్చు అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ముందుకు వస్తే వారికి తాను శిక్షణ ఇచ్చి ఇస్రో, నాసాలకు వెళ్ళడానికి వీలు కల్పిస్తాన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement