Friday, November 22, 2024

బిసి గ‌ర్జ‌నకు సిద్ధ‌మవుతున్న కాంగ్రెస్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందు కెళ్లుతోంది. అన్ని వర్గాల ప్రజలను హస్తం పార్టీ వైపు తిప్పుకునేందకు.. కాంగ్రెస్‌ నేతలు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏ ఒక చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకునేందుకు.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దళిత, గిరిజన మహాసభలను నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ.. అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో వివరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను కూడా ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు జనాభాలో సగం భాగం ఉన్న బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా బీసీ వర్గాల నుంచి వినిపిస్తున్న డిమాండ్లను పరిష్కరించేందకు కాంగ్రెస్‌ అధిష్టానం ముందుకొచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే జన గణనలో కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు క్రిమిలేయర్‌ విధానాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముందుగా ‘బీసీ గర్జన’ నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నారు. ఆ తర్వాత రాహుల్‌గాంధీ నిర్ణయాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నారు.

2003లో వరంగల్‌లో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు నేతృత్వంలో ‘బీసీ గర్జన’ నిర్వహించగా లక్షలాదిగ జనం తరలివచ్చారు. ఆ సభకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హాజరుకావడం.. బీసీలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు.. బీసీ గర్జన సభతోపాటు రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర తోడు కావడంతో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు బీసీ గర్జన సభను నిర్వహించి బడుగు, బలహీన వర్గాలను కాంగ్రెస్‌ వైపు తిప్పుకుంటే అధికారంలోకి రావడానికి పెద్ద కష్టమేమి కాదనే వాదన ఆ పార్టీకి చెందిన బీసీ నేతల్లో వినిపిస్తోంది.

దేశ జనాభాలో బీసీలు 50 శాతానికి పైగా ఉంటారని చెప్పడమే కానీ కచ్చితమై లెక్కలు లేవని బీసీ వర్గాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు మొదటి నుంచి చెబుతున్నారు. జనగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. అయినప్పటికి అధికార బీజేపీ నుంచి సానుకూలంగా స్పందన రావడం లేదని ఆయా పార్టీల్లోని బీసీ వర్గాలకు చెందిన నాయకులు చెబుతున్నారు. వృక్షాలకు, జంతువులకు, పక్షులకు లెక్కలున్నాయని, కానీ బీసీ జనాభా ఎంతనో ఇప్పటి వరకు కచ్చితమైన లెక్కలు లేవని ఆ వర్గాల నాయకులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో బీసీలకు అండగా ఉంటామని కాంగ్రెస్‌ అధిష్టానం ఇచ్చిన స్పష్టమైన హామీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేతే వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని, తద్వారా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఓబీసీ పార్లమెంటరీ కమిటీని యూపీఏ హయాంలోనే ప్రకటించిన అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్‌ విధానంతో తీవ్రంగా నష్టం జరుగుతోందని, క్రిమిలేయర్‌ ఎత్తివేస్తే జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తే పార్టీకి లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

25న కీలక సమావేశం: వీహెచ్‌
కుల గణనలో బీసీ గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, క్రిమిలేయర్‌ ఎత్తివేత అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీలోని బీసీ నాయకులు, ఇతర సీనియర్లతో ఈ నెల 25న ఇందిరాభవన్‌లో సమావేశం ఉంటుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు తెలిపారు. గతంలో వరంగల్‌లో బీసీ గర్జన నిర్వహించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కూడా భారీ బహిరంగ సభ నిర్వహించే అంశంపై పార్టీలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గాంధీ కుటుంబం హామీ ఇచ్చిందంటే.. ఆ హామీలను నేరవేరుస్తుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వీహెచ్‌ అభిప్రాయపడ్డారు. క్రిమిలేయర్‌ విధానాన్ని ఎత్తివేయాలని ప్రధాని మోడీని కలిసి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. బీసీలను కాంగ్రెస్‌ దగ్గరకు చేర్చుకునే అజెండా తీసుకుని ముందుకెళ్తే భవిష్యత్‌లో పార్టీకి మంచి అవకాశాలుంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement