బిజెపి కులగణనకు వ్యతిరేకి
ఒక నెలలో బిసి కుల గణన సాధ్యమా
బిసి డెడికేటెడ్ కమిషన్ బుసాని తో నివేదిక ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అమలు చేయాల్సిందే
హైదరాబాద్ – రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత. బీసీలకు రాజకీయంగా, ఆర్ధికంగా ప్రాంతీయ పార్టీలతోనే జరిగిందన్నారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కవిత డెడికేటెడ్ కమిషన్ బుసాని వెంకటేశ్వరరావుకు 35 పేజీల ‘బీసీల సమగ్ర అధ్యయన నివేదిక’ అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చెప్పిందని, బీజేపీ డీఎన్ఏలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ.. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కులగణనకు చట్టబద్దత ఉందా..
కులగణనకు చట్టబద్దత ఉందోలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కులగణకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ద్వంద వైఖరిని బీసీలు ఖండించాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం బీసీలకు ఎంతో న్యాయం చేసిందన్నారు.
ఒక నెలలోనే నివేదిక ఎలా..
11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదని, నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు కవిత. బీసీల అనుమానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇంటికి కుల గణన స్టిక్కర్లు అంటించలేదని తెలిపారు. డెడికేటెడ్ కమీషన్ ఇండిపెండెంట్‌గా పని చేయాలన్నారు. కమిషన్ రిపోర్ట్ రాజకీయ రిజర్వేషన్లకు పరిమితం కాకూడదని, ఇతర బీసీ అంశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినట్లు బీసీల కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు.