శాసభసభ ఏడో రోజు సమావేశాల్లో భాగంగా నేడు కులగణనపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా బీసీ కుల గణనపై ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ఈ క్రమంలోనే బీహార్ తరహాలో సమగ్ర కుల గణన చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కూడా కుల గణన పూర్తి కావొస్తోందన్నారు.. ఈనేపథ్యంలోనే తెలంగాణలో బీసీ గణన చేపడతున్నట్లు పేర్కొన్నారు..
కాగా, బీసీ కులగణనపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… బీసీ కులగణనపై తీర్మానం కాదు.. చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు కులగణన చేస్తే.. బీసీ కులాలే నష్టపోతాయన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలన్నారు. కులగణన ఏవిధంగా చేస్తారో ముందే స్పష్టం చేయాలన్నారు. కేంద్రం పరిధిలోని అంశంపై రాష్ట్రం ఎలా చట్టం చేస్తుందన్నారు. రిజర్వేషన్లు 50శాతం మించిపోతే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని గంగుల ప్రశ్నించారు. చట్టసభల్లో 50 శాతం ఎమ్మెల్యేలు ఉండాలని ఆశిస్తున్నామన్నారు.