మంచిర్యాల టౌన్, మార్చి 3 (ప్రభన్యూస్) : ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 30వేల ఎకరాలకు నీరందించాలనే ఉద్దేశ్యంతో గూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఆ ప్రాజెక్ట్ ప్రస్తుత బీఆర్ఎస్ పాలనలో నిరూపయోగంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సాగునీటిని అందించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులు, కాంగ్రెస్ నాయకులను శుక్రవారం ఆయన కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగరావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలతో కలిసి ఆయన మాట్లాడారు.
3 ఎంసీల నీళ్లను రెండు మోటర్ల ద్వారా ఇవ్వాల్సివుండగా నాసిరకమైన పనులను చేయడంతో తరచూ మోటర్ల రిపేర్లు జరగడం, పైపులు పగిలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సాగునీటి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 13 మంది ప్రాణానికి ముప్పు ఉన్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేయడం జరిగిందని అన్నారు. సాగు నీటి కోసం రైతులు పోరాటాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని మండిపాటును వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని అన్నారు. 30, 42వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు 30వేల ఎకరాలకు సాగు నీరందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతుందని, బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగివేసారిపోయారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తమ పూర్తి మద్దతు తెలియజేసి ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు