హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈ విద్యా సంవత్సరం బాసర త్రిపుల్ ఐటీ(ఆర్జీయూకేటీ) అడ్మిషన్లలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సీట్ల భర్తీలో కొత్త విధానాన్ని స్వస్తి పలికి మళ్లిd పాత విధానాన్నే అమలు చేయనున్నారు. టెన్త్‌లో వచ్చే గ్రేడింగ్(మార్కులు) ఆధారంగా ప్రవేశాలను చేపట్టేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి ఫలితాలు ఈనెల చివరన విడుదల కానున్న నేపథ్యంలో త్రిపుల్ ఐటీ ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించి ఈమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత విద్యా సంవత్సరం 2020-21లో కోవిడ్ తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దవడంతో ఇంటర్నల్స్‌లో(ఎఫ్‌ఏ-1) వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చారు. 2 లక్షలక పైగా విద్యార్థులకు 10 జీపీఏ రావడంతో విద్యార్థులను ఫిల్టర్ చేయడం కష్టతరమవడంతో పాలీసెట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా బాసర త్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పించారు. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం 2022-23లో పాలీసెట్ విధానాన్ని స్వస్తి పలికి పాతపద్ధతిలోనే ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌కు ముందు అనుసరించిన పద్ధతిలోనే టెన్త్‌లో వచ్చిన గ్రేడింగ్ ఆధారంగానే అడ్మిషన్లు చేపడతామని బాసర విశ్వవిద్యాలయం పరిపాలనాధికారి డాక్టర్ వై.రాజేశ్వర రావు తెలిపారు.
గతేడాది పాలిసెట్ ద్వారానే…
ప్రఖ్యాత బాసరలోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ)లో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు మంచి ఆదరణ ఉంది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా 1500 సీట్లకు అడ్మిషన్లు కల్పిస్తారు. టెన్త్‌లో విద్యార్థులకు వచ్చే మార్కులు, గ్రేడ్ల ఆధారంగా ఇక్కడ ప్రవేశాలు చేపడతారు. అయితే గత రెండేళ్లు కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షల నిర్వహణను రద్దు చేసి ఇంటర్నల్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. త్రిపుల్ ఐటీ ప్రారంభమైన 2008 నుంచి ఏ ఒక్క ఏడాది 10వేల మందికి కూడా దాటని 10 జీపీఏ 2019-20, 2020-21లో లక్షల్లో విద్యార్థులకు 10 జీపీఏ వచ్చింది. 2020లో 1,41,383 మందికి 10 జీపీఏ వచ్చింది. అయితే ఆ ఏడాది పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపట్టినప్పటికినీ విద్యార్థులను ఫిల్టర్ చేయడంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దాదాపు 40 రోజుల సమయం పట్టింది. 2021లోనూ పరీక్షలు రద్దవడంతో ఎఫ్‌ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వగా 2,10,647 మందికి టెన్త్‌లో 10 జీపీఏ వచ్చింది. పాత పద్ధతిలోనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలంటే రెండు, మూడు నెలలు సమయంపట్టే అవకాశం ఉంది. దాంతో పాలిసెట్ ద్వారా సీట్లు భర్తీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గడం, పదో తరగతి పరీక్షలను విద్యార్థులు రాయడంతో మళ్లిd పాత పద్ధతిలోనే సీట్లు భర్తీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
త్వరలో నోటిఫికేషన్…
ప్రస్తుతం పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం జరుగుతోంది. ఈనెల 11వ తేదీలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈనెల చివరి కల్లా టెన్త్ ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈక్రమంలో టెన్త్ ఫలితాలపై ఓ స్పష్టత రాగానే బాసర త్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.